తోడల్లుడు మోసపూరితంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని... ఓ రైతు పురుగుమందు సీసా వెంటబెట్టుకుని మరీ టవరెక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలోని కోస్గి పురపాలిక పరిధి సంపల్లిలో జరిగింది. సంపల్లికి చెందిన కృష్ణారెడ్డి, బిచ్చమ్మ దంపతుల పెద్ద కుమార్తె ప్రమీలను కోస్గి మండలంలోని అమ్లికుంట్లకు చెందిన కొత్తూరు నారాయణరెడ్డికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. ఇంటికి పెద్దల్లుడు కావడం వల్ల నారాయణరెడ్డి అమ్మికుంట్లలోని తనకున్న మూడెకరాల భూమిని అమ్మి మిగిలిన ముగ్గురు మరదళ్ల పెళ్లిళ్లు చేశారు.
మిగిలి ఉన్న 12 ఎకరాల్లో నారాయణరెడ్డికి నాలుగెకరాల భూమిని మామ కృష్ణారెడ్డి రాసిచ్చారు. కృష్ణారెడ్డి చనిపోయాక నాలుగో కుమార్తె రాధాదేవి భర్త మర్రి కృష్ణారెడ్డి అత్త బిచ్చమ్మకు మాయమాటలు చెప్పి 8 ఎకరాల్లో విడతల వారీగా అయిదెకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగిలిన మూడెకరాల భూమి మామ కృష్ణారెడ్డి కాస్తులో ఉంది. ఇటీవల దాన్ని సైతం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నాడని, అధికారులు డబ్బులు తీసుకొని సహకరిస్తున్నారని నారాయణరెడ్డి, ఆయన భార్య ప్రమీల ఆరోపించారు.
మద్దతుగా నిలిచిన గ్రామస్థులు...
నారాయణరెడ్డి, మర్రి కృష్ణారెడ్డి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఠాణాలో కేసులూ నమోదయ్యాయి. తనకు వాటాగా రావాల్సిన భూమిని మర్రి కృష్ణారెడ్డి అన్యాయంగా లాక్కున్నాడని, కేసులు పెట్టించాడని నారాయణరెడ్డి ఆరోపిస్తూ టవర్ ఎక్కారు. ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ కుటుంబ సభ్యులను పోషిస్తున్న నారాయణరెడ్డిని మరదలి భర్త మర్రి కృష్ణారెడ్డి మోసం చేస్తున్నాడని ఊరంతా ఏకమై రాస్తారోకో నిర్వహించారు.
లిఖిత పూర్వక హామీతోటవర్ దిగిన నారాయణరెడ్డి
ఈ విషయమై తహసీల్దారు రామకోటి జిల్లా అదనపు పాలనాధికారితో చరవాణిలో మాట్లాడి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీతో నారాయణరెడ్డి టవర్ దిగారు. మర్రి కృష్ణారెడ్డి పేరు మీద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి రిజిస్ట్రార్‌కు లేఖ రాస్తామని తహసీల్దార్ తెలిపారు. ఠాణాలో నమోదైన కేసులను కొట్టివేయిస్తామని, కాస్తులో ఉన్న భూమిపై పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని లిఖితపూర్వకంగా తెలిపానన్నారు.