Nagarjunasagar project spillway repair work గతంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న నాగార్జునసాగర్ స్పిల్‌వే మరమ్మతు పనులు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం 26 గేట్ల కింది భాగంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ భారీ గుంతల వల్ల ప్రాజెక్టుకూ ప్రమాదం ఏర్పడవచ్చన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టు స్పిల్‌వే మరమ్మతులకు నిధుల కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించగా.. గత నెలలో రూ.20 కోట్లు మంజూరయ్యాయి.
ఇప్పటికే 22 భారీ గుంతలను గుర్తించిన ఇంజినీరింగ్ సిబ్బంది తొలి దశలో 11 గుంతలను పూడ్చే పనులు చేస్తున్నారు. వీటికి సమానంగా డ్రిల్లింగ్ చేసిన అనంతరం కాంక్రీట్ ద్వారా గుంతలను పూడ్చుతున్నారు. ఈ పనులు వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నిర్దేశించినా.. అప్పటి వరకూ పూర్తవుతాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సహజంగా ప్రాజెక్టుకు జూన్ నెలాఖరు నుంచి నుంచి వరద మొదలవుతుంది. వరద మొదలైతే పనులు సాగవు. ఈ నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తి చేయకుంటే జులై వరకు పూర్తికావన్న అనుమానాలున్నాయి. అయితే అధికారులు మాత్రం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని...ఎగువ నుంచి వరదలు మొదలుకాకముందే జూన్ నెలాఖరుకు పనులన్నీ పూర్తి చేస్తామని వెల్లడిస్తున్నారు.
ఎడమ కాల్వకు మరమ్మతులు జరిగేనా..: ప్రాజెక్టులో కీలకమైన ఎడమ కాల్వ పర్యవేక్షణ, మరమ్మతులను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రపంచ బ్యాంకు, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల నిధులు కలిపి రూ.4444 కోట్లతో 2008లో ప్రారంభమైన సాగర్ ఎడమ కాల్వ ఆధునికీకరణ పనులు గతేడాదే పూర్తయ్యాయి.
అయితే కాల్వ మరమ్మతు పనుల్లో నాణ్యత కొరవడటం, ఆధునికీకరణ పూర్తయినా.. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో గతేడాది సెప్టెంబరు 7న నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద ఎడమ కాల్వకు గండిపడింది. సమీపంలోని గురుకుల పాఠశాల మునగడంతో పాటు.. కాల్వ కింద ఉన్న 500 ఎకరాల్లో పంట నష్టం జరగింది. విద్యుత్‌శాఖకు రూ.కోటి వరకు నష్టం వాటిల్లింది.
సుమారు పదేళ్ల పాటు మరమ్మతు పనులు చేసి రూ. 1350 కోట్లు ఖర్చు చేసినా కాల్వకు పూర్తి స్థాయిలో లైనింగ్ చేయలేకపోయారు. దీంతో కాల్వలో నీటి ప్రవాహం పెరిగినప్పుడు బలహీనంగా ఉన్న చోట కోతకు గురవుతోంది. కట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణం మరమ్మతులు చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: