రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా ఆరో విడత హరితహారం కార్యక్రమం జరుగుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్పోర్ట్స్ స్కూల్లో మొక్కలను నాటి వాటికి నీటిని పోశారు. హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కుల వృత్తులకు సంబంధించిన వేషధారణలు, వారి వృత్తికి సంబంధించిన కళల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. కరోనా సమయంలో కూడా రైతుబంధు సకాలంలో అందిస్తుండటం వల్ల తెలంగాణ రైతాంగం అద్భుతంగా పంటలను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు ధాన్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందని శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కులవృత్తులు చేసుకుంటున్నవారు కూడా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మిడ్జిల్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కూల్చివేత ఎఫెక్ట్: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం విచారం