మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసిల్దార్ నాగరాజు, స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్ యాదవ్, వీఆర్ఏ సాయిరాజ్‌ను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో అనిశా అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.
కీసర మండలం రాంపల్లి దాయారలో వివాదాస్పద భూమిని సెటిల్ చేసేందుకు నాగరాజు.. స్థిరాస్తి వ్యాపారుల నుంచి రూ. కోటి పది లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయినట్లు అనిశా తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ చేయాలని, ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకున్న నాగరాజు వెనుక ఇంకా ఎవరెవరున్నారనే వివరాలు సేకరించాల్సి ఉందని అనిశా తరఫు న్యాయవాది వాదించారు.
తహసీల్దార్ నాగరాజుకు బినామీ ఆస్తులేమైనా ఉన్నాయా అనే విషయం కూడా తెలుసుకోవాల్సిఉందని తెలిపారు. ఇప్పటికే విచారణ పూర్తయిందని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'