మహబూబ్ నగర్ పట్టణంలోని 29వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి అనుచరులకు, స్వతంత్ర అభ్యర్థి అనుచరులకు మధ్య గొడవ చోటుచేసుకుంది. ఎంఐఎంకు చెందిన అనుచరులు బోగస్ ఓట్లు వేస్తున్నారని వారు ఆరోపించారు. విధుల్లో ఉన్న పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొనిపోవటం వల్ల పట్టణ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో పోలీసులు బలగాలను మోహరించారు.
ఎంఐఎం అభ్యర్థి ఇంట్లో ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఇంటిని సోదా చేసేందుకు వెళ్లగా... అభ్యర్థి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వెనుతిరిగిన పోలీసులు... ఎన్నికల తనిఖీ బృందాలకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు బృందాలు ఇంటిని సోదా చేశారు. ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు ఉన్నట్టు గుర్తించిన అధికారులకు వారంతా తమ బంధువులు అంటూ బుకాయించారు. ఆ ఇంటి నుంచి అందరినీ బయటకు పంపటం వల్ల వివాదం సద్దుమణిగింది. పోలీసులు, తనిఖీ బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి