లాక్‌డౌన్ నేపథ్యంలో మూణ్నెల్ల ఇంటి అద్దెల వాయిదాకు చట్టం తెచ్చిన ప్రభుత్వం... కౌలు కష్టాలపై కూడా దృష్టి సారించాలని సంబంధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2014 నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 36,500 మంది కౌలు రైతులు ఉన్నారు. వీరు ఏటా భూమిని కౌలుకు తీసుకొని ఖరీఫ్‌లో పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటలు వేస్తారు. రబీలో మామిడి, బత్తాయి సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ సారి వాతావరణం అనుకూలించకపోవడం, వడగండ్ల వానలకు పెద్దఎత్తున మామిడి, ఇతర పంటలు నేలరాలాయి.
కౌలు రైతులు వేసిన పంటల్లో సగం కూడా దిగుబడి రాని దుస్థితి. అప్పులు చేసి పంటలు వేసిన కౌలు రైతులు చేతికి వచ్చిన పంటలను మార్కెటింగ్ చేసుకోడానికి అవకాశం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విషయమై వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల ఉద్యానశాఖ అధికారులు విజయభాస్కర్, జయరాజ్ కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా గుర్తింపు అంటూ ఏమీ లేదన్నారు. పాసు పుస్తకాలు, పట్టాలు వీరికి ఉండవన్నారు.
ఇవీ చూడండి: తగ్గుతున్న కేసులు.. పలుచోట్ల కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేత