క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మామిడి పంట కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాను ఎంపిక చేయడం పట్ల కేంద్రానికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు. ఐదు జిల్లాల్లో మామిడి పండిస్తున్న రైతులకు ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమేలు జరగనుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద కేంద్రం రూ.వంద కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ నిధులతో మామిడి ఉత్పత్తిని పెంచడం, విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో పంటను పండించడం, రైతులకు శిక్షణ, శీతల గిడ్డంగుల ఏర్పాటు, మార్కెటింగ్ రైతులకు అందుబాటులోకి తెస్తారని ఆమె వివరించారు.
పాలమూరు మామిడి ఖ్యాతి ప్రపంచానికి వెళ్తుందన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయనున్నారని… వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తెరాస నేతలు భాజపా పాలిత రాష్ట్రాల గురించి ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. కోటి ఎకరాల్లో పంట పండిందని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ అందుకు తగిన విధంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకయారన్నారు. ఈటల రాజేందర్ ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టుపెట్టారన్న తెరాస నేతల విమర్శలపై ఆమె ఘాటుగానే స్పందించారు. ఆత్మగౌరవం ఉన్నవాళ్లెవరూ కేసీఆర్ వద్ద ఉండలేరన్నారు. పదవులు, అధికారం, స్వప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారన్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: Telangana: ఏడేళ్లలో తెలంగాణ మాగాణమైంది!