పురపాలకపరిధిలో ఉన్న పవర్ బోర్లను తొలగించవద్దంటూ భాజపా కౌన్సిలర్లు మహబూబ్నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రజలకు తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా వార్డుల్లో, కాలనీల్లో ఏర్పాటు చేసిన పవర్ బోర్లను అధికారులు తొలగిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని పవర్ బోర్లను తొలగించడం సమంజసం కాదని మండిపడ్డారు.
బోర్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించేందుకు మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని... ఒకవేళ మోటర్లు మొరాయిస్తే పదిరోజులైనా పట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. మోటర్లు బాగయ్యే వరకు పవర్ బోర్ల ద్వారా ప్రజలు తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉన్న ఫలంగా వాటిని తొలగిస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూడాల్సిన అవసరం అధికారులకు ఉందని.. అందుకు అనుగుణంగా తొలగించిన వాటిని పునరుద్ధరించాలని భాజపా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.