ఖమ్మంజిల్లా మధిర ప్రాంతానికి చెందిన లంక కొడయ్య వృత్తిరీత్యా వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. స్వతహాగా సేవాతత్పరుడైన కొండయ్య సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. తనకొచ్చిన కళలను ప్రదర్శిస్తూ ప్రాణాంతక వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఆకట్టుకునే వేషాలతో అవగాహన
రెండు దశాబ్దాలుగా ఎయిడ్స్లాంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ఖాళీ సమయం దొరికితే చాలు అభాగ్యుల సేవలో లీలమైపోతాడు. స్వతహాగా జానపద కళాకారుడు అవ్వడం వల్ల సున్నితమైన అంశాలను ఆకట్టుకునే విధంగా ప్రదర్శిస్తూ వినూత్నరీతిలో అవగాహన కల్పిస్తున్నాడు. కోయదొరలా, రిక్షావాలాలా, కళాకారుడిలా, జాతకాలు చెప్పేవాడిలా రకరకాల వేషధారణలో ఆకట్టుకుంటూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నాడు.
అభాగ్యులకు నేనున్నానంటూ..
రకరకాల వేషాలు వేసి ఇంటింటికీ తిరుగుతూ బియ్యం సేకరించి బాధిత కుటుంబాలుకు అందిస్తూ కుమిలి పోతున్న వారి కుటుంబాల్లో నేనున్నానంటూ ధైర్యం నింపుతున్నాడు కొండయ్య. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది అవగాహన కార్యక్రమాలు నిర్విహించి ఎందరినో చైతన్యపరిచాడు.
అవగాహనే కాదు.. ఆచరణ కూడా..
మతిస్తిమితం లేక వీధుల్లో తిరుగుతున్న వారిని ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి, దుస్తులు అందించి అన్నంపెట్టి ఆదరిస్తాడు కొండయ్య. తన ఇంట్లోనే మహాత్మాగాంధీ పేరుపై పాత దుస్తుల బ్యాంకును ఏర్పాటు చేసి దాతల నుంచి పాత దుస్తులు సేకరించి యాచకులకు అందిస్తున్నాడు. ఇతని సేవలకు మాజీ గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్నాడు. నిస్వార్థంగా సమాజ సేవలో పునీతుడవుతున్న లంకా కొండయ్య సేవలు ఎందరికో ఆదర్శనీయం.
ఇదీ చూడండి: నూటొక్క శతకాల ధీరుడు... ఈ ఆచార్యుడు