ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం రామానుజవరానికి చెందిన సరికొండ నరేంద్రరాజు(ఎంబీఏ), శీలం సీతారామిరెడ్డి(బీటెక్), వేమిరెడ్డి వేణుగోపాలరెడ్డి (బీటెక్) సొంత ఊరులోనే వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. సీతారామిరెడ్డికి చెందిన మూడెకరాల మామిడితోటలో కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. రెండేళ్ల క్రితం రూ.లక్ష వెచ్చించి నాలుగు పెద్దవరుస నాటుకోడిపెట్టలు, ఒక జాతి పుంజు కొనుగోలు చేశారు. వాటితో క్రాసింగ్ చేయగా గుడ్లు పెట్టాయి. ఆ గుడ్లపై నాటుకోళ్లను పొదిగిస్తున్నారు. పెట్టలు గుడ్లు పెడుతుండగా వాటిని పొదిగించడంతో పిల్లలు పుడుతున్నాయి. గుడ్డు ఒక్కోటి రూ.500, వారం రోజుల కోడి పిల్ల రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వారి వద్ద 5 పుంజులు, 50 పెట్టలు, 50 పిల్లలున్నాయి. వచ్చే ఆదాయంతో మరిన్ని కోళ్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.1200 పిల్లలను విక్రయించగా రూ.10లక్షల లాభం వచ్చినట్లు తెలియజేశారు. ఒక్కో పుంజు రూ.70వేల నుంచి రూ.1.50లక్షలు, ఒక్కో పెట్ట రూ.20-50వేల మధ్య ధర పలుకుతోంది. ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల నుంచి పుంజులను కొనుగోలు చేసి ఇక్కడ పెట్టలతో క్రాసింగ్‌కు ఉపయోగిస్తున్నట్లు వివరించారు.
నెలకు రూ. 15 వేలు ఖర్చు
మామిడితోటలో పుంజులు, పెట్టలు, పిల్లలు ఇలా వేర్వేరు మూడు షెడ్లలో పెంచుతున్నారు. మేతగా ధాన్యం, రాగులు, సజ్జలు, గంట్లు, అంజురా, బాదం, ఎండుద్రాక్షతో పాటు పుంజులు, పిల్లలకు అదనంగా ఉడికించిన గుడ్లు వేస్తారు. వెరసి మేత కోసం నెలకు రూ.15వేలు ఖర్చు అవుతోంది. కోడి పిల్లలు 7, 14, 30 రోజుల వయస్సులో కీళ్లవాతం నివారణ, రోగనిరోధకశక్తికి ఇంజక్షన్లు వేస్తున్నారు. కోళ్లు సంచరించడంతో తోటంతా శుభ్రంగా ఉండటమే కాకుండా వాటి పెంట సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతోంది. అక్కడ పెంచుతున్న పలు రకాల శునకాలు తోటతోపాటు కోళ్లకు రక్షణగా ఉంటున్నాయి. వచ్చిన లాభంతో మరిన్ని కోళ్లు కొనుగోలు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తామని, దాంతోపాటు వ్యవసాయ పనులు కూడా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: hetero drugs: 'హెటిరో' సోదాల్లో అధికారులకు దిమ్మ తిరిగిందట? డబ్బు, బంగారం ఎలా దాచారంటే...
కోళ్లకు అందాల పోటీలు..ఎక్కడో తెలుసా..!