Drinking Water Problems: కరీంనగర్ శివారు గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతం అవుతున్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించడం లేదనే కారణంతో మిషన్‌భగీరథ పనులను గుత్తేదారులు నత్తనడక చేపట్టడంతో జనాలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. శివారు గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసినప్పటికీ బోర్డులు మారడం తప్ప సేవల్లో మాత్రం ఎలాంటి మార్పులేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ మిషన్ భగీరథ పనుల్లో ఆలస్యం వల్ల తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది.
అసంపూర్తి పైపులైన్లకు తోడు సాంకేతిక సమస్యలు, ఇంటర్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో నీటి సరఫరా జరగడం లేదు. సరస్వతి నగర్, కేఆర్ కాలనీ, చంద్రపురి కాలనీ, విద్యారణ్యపురి, హనుమాన్ నగర్, కోదండ రామాలయం వీధి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల బాధలను చూసిన స్థానిక కార్పొరేటర్ స్వయంగా సొంతఖర్చుతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
విలీన గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం అయిదున్నర కోట్లతో టెండర్లు పిలిచినా గుత్తేదారులు పనులు చేపట్టడం లేదు. నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లిస్తున్నా తమకు తగిన సదుపాయాలు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. నీటి సమస్య కారణంగా అద్దెకు కూడా ఎవరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎండాకాలంలో గొంతెడుతున్న కాలనీల బాధలు చూసైనా అధికారులు త్వరగా మిషన్ భగీరథ పనులు పూర్తిచేసి నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఆ క్వారీల్లో మైనింగ్ ఆపాలని ఎన్జీటీ ఆదేశం
'తాజ్ మహల్ మా కుటుంబానిదే.. డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయి'