వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలను కేటాయించడంతో సాగు ఇక్కట్లను అధిగమించేలా తీసుకున్న నిర్ణయం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 6.40లక్షల మంది రైతాంగానికి పలు రకాలుగా సాయం అందనుంది. పీీఎం కిసాన్ సమ్మాన్ యోజన సహా ఫసల్ బీమా పరిహారాలు, ఇతరత్రా వ్యవసాయ రంగ మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఉమ్మడి జిల్లా వాటాగా కేంద్ర నిధులు అందనున్నాయి.
వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలకు నిధులు అందే వీలుండటంతో జిల్లాల్లో ఉన్న 129 సంఘాలకు మేలు జరగనుంది. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం విషయంలో ఈ ట్రేడ్ విధానం పక్కాగా అమలు చేస్తూ ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్మేలా చూస్తామనే ప్రకటనతో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలోనే నాలుగు జిల్లాల పరిధిలోని 12 వ్యవసాయ మార్కెట్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ-నామ్ ఈసారి అయినా పక్కాగా అమలయ్యేలా ఈ నిధులు అందితే విపణి వీధిలో కొత్త ధరను రైతు అందుకునే వీలుంది.
నష్టాల‘పాలు’ కాకుండా..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయం తరువాత పాడి పరిశ్రమకే పెద్దపీట. ఒక్క కరీంనగర్ డెయిరీ పరిధిలోనే నాలుగు జిల్లాలోని పలు మండలాల్లో 70వేలరైతు కుటుంబాలున్నాయి. ఇవే కాకుండా ఇతరత్రా డెయిరీలతో పలువురు ఉపాధిని అందుకుంటున్నారు. కరీంనగర్ డెయిరీ ద్వారా 2లక్షలు సహా ఇతరత్రా కలిపి సుమారుగా 4లక్షల లీటర్ల పాల ఉత్పత్తి ఉమ్మడి జిల్లాలో ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అన్నింటా ఇటీవల లాక్‌డౌన్ వల్ల 20 నుంచి 30శాతం డిమాండ్ తగ్గింది. పాడి రైతులకు రూ.5వేల కోట్ల మేర ప్రోత్సాహాన్నివ్వాలనే నిర్ణయంతో నాలుగు జిల్లాల పరిధిలోని సుమారు లక్ష మందికిపైగా ఈ ప్రోత్సాహఫలం దక్కేవీలుంది. డెయిరీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.15వేల కోట్లు కేటాయించడంతోపాటు డెయిరీ సొసైటీలకు 2శాతం వడ్డీ రాయితీ అందించాలనే నిర్ణయంతో పాడిరైతుల ప్రగతికి పరోక్షంగా మేలు జరగనుంది.
ఆర్థిక అండదండ ఇలా..
- మత్స్య సంపద యోజనకు రూ.20వేల కోట్లు కేటాయించడంతో నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 72వేల మత్స్య కార్మిక కుటుంబాలకు జీవనోపాధి మెరుగవనుంది. వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయంతో ఇన్నాళ్లుగా ఎదురయ్యే ఇబ్బందికి భరోసా లభించనుంది. ఇప్పటికే మత్స్య పరిశ్రమకు పుట్టినిల్లుగా నాలుగు జిల్లాలు పేరొందాయి. ఇక్కడ ఉన్న భారీ జలాశయాలతో పాటు చిన్ననీటి వనరుల్లో ప్రతి ఏటా లక్షలాది టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. తాజాగా కాళేశ్వరం జలాలతో కాలువలు జలకళను సంతరించుకోవడం, శ్రీరాజరాజేశ్వర, ఎల్‌ఎండీ, ఎల్లంపల్లి, సుందిళ్ల, నందిమేడారం ఇలా పలుచోట్ల ఉన్న జలసవ్వడితో మత్స్యకారులకు మరింత ఉపాధి అందనుంది.
- పశువులు, మూతి కాళ్లకు వచ్చే వ్యాధుల కోసం టీకాలు వేయాలని నిర్ణయించడం రూ.13,343కోట్లు కేటాయించడం వల్ల ఉమ్మడి జిల్లాలో ఉన్న సుమారుగా 8లక్షలకుపైగా మూగజీవాల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం లభించనుంది.
- ఆహార రంగంలోని సూక్ష్మపరిశ్రమలకు రూ.10వేల కోట్లు కేటాయించడంతో ఉమ్మడి జిల్లాలోని ఈ రంగం పరిధిలో ఉన్న సుమారు 100కుపైగా సూక్ష్మ, చిన్న సంస్థలకు ప్రయోజనం కలుగనుంది.