జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. తాగునీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కొందరు అక్రమార్కులు జూరాల నీటిని చేపల చెరువులకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ మోటార్ల ద్వారా నీటిని చౌర్యం చేస్తున్నారు.
ప్రస్తుత నిల్వ 1.6 టీఎంసీలే
ప్రస్తుతం జూరాలలో 1.6 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. వర్షాలు లేక ఈ ఏడాది ఇప్పటివరకు ఆశించిన మేర వరద రాకపోవడం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోయింది. దీని వల్ల ఈ నీటినే తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే కొందరు అక్రమార్కులు ఈ నీటిని చేపల చెరువు సాగుకోసం వినియోగిస్తున్నారు. ఇంతజరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టుకు ఎప్పుడు వరద వస్తుందా... అని ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతులకు నిరాశే మిగులుతోంది. తాగునీటి అవసరాలకు కూడా నీరు అందుబాటులో లేని సమయంలో ఇలా మళ్లించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతులపై స్పష్టత కరవు
చేపల చెరువులకు జూరాల జలాలను మళ్ళించడానికి అనుమతులు ఎవరిచ్చారనే అంశంపై స్పష్టత కొరవడింది. జూరాల ప్రాజెక్టు అధికారులను నీటి పారుదల శాఖ అధికారులు సంప్రదించగా సమాధానం దాటవేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతులిచ్చారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి : రెండు పడక గదుల ఇంటి కల నెరవేరేనా?