తెలంగాణకు సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రంతో పాటు ఆవాల పరిశోధనా కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రాన్నికోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు ప్రతిపాదనలు పంపారు. కాళేశ్వరం ఎత్తిపోతల, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో వ్యవసాయానికి సమృద్ధిగా సాగునీరుందని... తెలంగాణలో 25 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టులున్నాయని మంత్రి ప్రతిపాదనలో పేర్కొన్నారు.
ఆవాల పంట ఉత్పత్తికి అనువైన ప్రాంతమైన జగిత్యాలలో పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేసి నూతన వంగడాలు అనువైన సాగుపద్ధతులు కనుగొని రైతులకు మేలు జరిగేలా సహకరించాలని మంత్రి కోరారు. తెలంగాణలో సాగునీరు పూర్తిగా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో భూగర్భజలం పెరిగి వాతావరణ పరిస్థితులు మారాయన్నారు. తాగునీరు, సాగునీరు కలిసిపోయి కలుషితం కాకుండా సాగునీటి యాజమాన్యం సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితులను గుర్తించి సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రం, ఆవాల పరిశోధనా కేంద్రాలను మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం