ఉమ్మడి సైబరాబాద్ కమిషనరేట్‌లో మరోసారి విభజనకు కసరత్తులు జరుగుతున్నాయి. సైబరాబాద్ విభజన అనంతరం శంషాబాద్ జోన్ పరిధి విస్తృతమైంది. ప్రస్తుతం ఈ కమిషనరేట్ విస్తీర్ణం 3,644 చదరపు కిలోమీటర్లు. దీనిలో శంషాబాద్ జోన్ పెద్దది. అందువల్ల పాలనపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జోన్‌ను వికేంద్రీకరించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ దృష్టి సారించారు. పలు ప్రతిపాదనలను ఆయన ప్రభుత్వానికి పంపారు. వారంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటు కానుంది. శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లలో నూతనంగా చెరో ఠాణా ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం కానుంది.
అత్తాపూర్ కేంద్రంగా కొత్త ఠాణా
రాజేంద్రనగర్ ఠాణా మరోమారు విభజించనున్నారు. ప్రస్తుతం ఈ పోలీస్ స్టేషన్ పరిధి 48 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీని జనాభా దాదాపు 4.63 లక్షలు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 120 మంది రౌడీషీటర్లుంటే అందులో 80 శాతం మంది ఈ ఒక్క పోలీస్‌స్టేషన్ పరిధిలోనే ఉన్నారు. తాజాగా అత్తాపూర్ కేంద్రంగా కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. తాజా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే నాలుగు జోన్ల సైబరాబాద్ అవతరిస్తుంది.
ఇవీ చదవండి:నేడే అసెంబ్లీ చివరి రోజు