సైక్లింగ్‌ను చాలామంది ఫిట్నెస్ కోసం.. కొంతమంది వ్యాపకంగానూ... మరికొంతమంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేస్తారు. కానీ ఈ యువకులు మాత్రం.. ఓ మంచి ఉద్దేశంతో సైకిల్ సవారీ చేస్తున్నారు. ప్రపంచాన్ని మార్చగలిగే ఆయుధం 'విద్య' అన్న భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం మాటల్ని నిజం చేయడం కోసం.. చదువుకు దూరమైన బాలబాలికలకు ఆ అవకాశం కల్పించడం కోసం... వీళ్లు సైకిల్ రైడ్ మొదలు పెట్టారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అంటే ఐదు రోజుల వృత్తి బాధ్యతల నిర్వహణ.. వారాంతం విందు, వినోదాలు అని కాకుండా సమాజహితానికి తమకు ఇష్టమైన వ్యాపకాన్నే ఉపయోగించుకుంటున్నారు. నాలుగేళ్లుగా.. సేవా సవారీ చేస్తున్న యువత స్ఫూర్తిని చూద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలె గ్రామానికి చెందిన కలగోట్ల విజయభాస్కరరెడ్డి, మారూరి గోపిచంద్ ఉన్నత విద్యనభ్యసించి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి ఫిట్నెస్, పరుగు, సైకిల్ రైడ్ అంటే ఇష్టం. గోపీచంద్‌కు పదేళ్ల నుంచి విశాఖపట్నంలోని గ్లోబల్ ఎయిడ్ స్వచ్ఛంద సేవా సంస్థతో అనుబంధం ఉంది. ఆ సంస్థ 2008 నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని గిరిజన పిల్లల్ని దత్తత తీసుకుని వారికి పాఠశాల విద్యతోపాటు ఉన్నత విద్యను అన్ని వసతులతో అందజేస్తోంది. ఆ సంస్థకు సాయం అందించే క్రమంలో సైకిల్ సవారీ ఆలోచన గోపీచంద్‌కు కలిగింది. అప్పటికే యువ ఇంజినీర్లు ట్రైడర్స్ పేరుతో సైకిల్ రైడర్ల సంస్థను ఏర్పాటు చేసుకుని దూర ప్రాంతాలకు సవారీ చేస్తున్నారు. సామాజిక సేవ వైపు తమ పయనం మళ్లిస్తే బాగుంటుందనే ఆలోచన చేసి వెంటనే భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం పేరిట సేవా సైకిల్ సవారీని ప్రారంభించారు.
హైదరాబాద్ టూ రామేశ్వరం
వరుసగా నాలుగో ఏడాది.. ట్రైడర్స్ బృంద సభ్యులు సేవా రైడ్ నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి రామేశ్వరం వరకు 1200 కిలోమీటర్ల మేరకు సైకిల్ సవారీ చేపట్టారు. ఫిబ్రవరి 8న హైదరాబాద్ ఎల్బీనగర్లో ప్రారంభమైన సైకిల్ యాత్ర.. 14న రామేశ్వరంలోని కలాం మెమోరియల్ వద్ద ముగిసింది. 15మంది సభ్యులు ఈసారి యాత్రలో పాల్గొన్నారు. గ్లోబల్ ఎయిడ్ సంస్థ ద్వారా చదువుకుంటున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 300 మంది విద్యార్థులే కాకుండా తాము స్వయంగా దత్తత తీసుకున్న 40 మంది విద్యార్థుల చదువుకు విరాళాలు సేకరిస్తున్నారు. 340 మంది చదువులకు రూ.11.74 లక్షల నగదు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు 10 లక్షల నగదు సేకరించారు. మా వల్ల చదువుకునే విద్యార్థులను చూస్తే.. ఆనందం కలుగుతుందంటున్నారు ట్రైడర్ సంస్థ సభ్యులు.
ఒక్క రూపాయి ముట్టుకోరు
300 మంది గిరిజన విద్యార్థుల చదువుకు తాము సైకిల్ సవారీ చేస్తున్నామని.. మీరూ సేవలో పాల్గొనాలంటే ఎంతోకొంత సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ సాయాన్ని అందిస్తున్నారు. ఇలా ఆన్‌లైన్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. సైకిల్ సవారీచేసే వారు నేరుగా పైసా చేతికి తీసుకోరు. ఇంకో విశేషం ఏంటంటే.. వీరికి నిధుల సేకరణతో సంబంధం ఉండదు. నేరుగా గ్లోబల్ ఎయిడ్ సంస్థకు అవి మళ్లుతున్నాయి. సైకిల్‌పై దూర ప్రయాణం చేయాలంటే ఆహారం, ఇతర అవసరాలకు ఖర్చు అవుతుంది. తమ సొంత నగదు వెచ్చించి సవారీ చేస్తున్నారు. ఈ ఏడాది 16 మంది సవారీకి వెళ్తుంటే ఒక్కొక్కరు రూ.10 వేలు చొప్పున తమ సొంత నగదు వెచ్చించి సవారీ చేస్తున్నారు.
ముందే ప్రణాళిక
సైకిల్ సవారీకి ముందు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటున్నారు. 300 మంది పిల్లల చదువుకు ఎంత నగదు సేకరించాలనే అంశంపై ఒక ప్రణాళిక రూపొందించుకుని ఆన్‌లైన్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. రైడ్‌కు బయలుదేరే కొన్ని రోజుల ముందు అందరికి తమ లక్ష్యం తెలిసేలా చేసి లక్ష్యాన్ని అందుకుంటున్నారు. ఒక విద్యా సంవత్సరంలో పిల్లల చదువులకు అవసరమయ్యే నగదు అంతా సమకూర్చితే ఆనందమే కదా.. అలా గిరిజన విద్యార్థుల మోముల్లో ఆనందం నింపుతున్నారు.
2017 నుంచి సవారీలు ఇలా..
- 2017 జనవరిలో తొలిసారి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరమైన విజయవాడ వరకు 300 కిలోమీటర్ల సవారీని 10 మంది యువకులు చేశారు. రూ.1.50 లక్షల విరాళాల సేకరణ లక్ష్యం కాగా రూ.3 లక్షలు వచ్చాయి. దీంతో యువ ఇంజినీర్లలో ఉత్సాహం మరింత పెరిగింది.
- 2018 ఫిబ్రవరి రెండోవారంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు 650 కిలోమీటర్ల సైకిల్ సవారీని 11 మంది పూర్తి చేశారు. రూ.5.30 లక్షల లక్ష్యానికిగాను రూ.6 లక్షలు సేకరించారు.
- 2019 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 21 వరకు హైదరాబాద్ నుంచి మైసూర్‌కు 800 కిలోమీటర్ల సైకిల్ సవారీ చేశారు. రూ.6.50 లక్షలు సేకరణ లక్ష్యంకాగా రూ.7 లక్షలు వచ్చాయి. చిన్నారుల చదువుకోసం.. మంచి పని చేస్తున్న ఈ యువతకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు..