కరోనా కారణంగా కుదేలైన నేతన్నలు హైద్రాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నాయకులు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సమకాలీన పరిస్థితులలో నేతన్నలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రస్తావించారు. నేతన్నలకు 93కోట్ల రూపాయలను అందుబాటులోకి తీసుకొచ్చామన్న కేటీర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కమిటీ అభివర్ణించింది. ఓ వైపు కష్టాలతో సతమతమవుతున్న నేతన్నలను ఆదుకోవడం మాని... థ్రిఫ్టు ఫండ్‌ను వాడుకోమని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు.
చేనేత వృత్తికి చీడపురుగులా దాపురించిన కార్పొరేట్ షాపింగ్ మాల్ల మోసపూరిత బాగోతాలు మంత్రి కేటీఆర్ దృష్టికి రాకపోవడానికి గల కారణాలేమిటో తెలపాలని కోరారు. ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాన్ని మంత్రి పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఎన్నికల సందర్భంగా ఇస్తానన్న 5 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ ఏమైందని నిలదీశారు. ప్రభుత్వం ఇకనైనా నేతన్నలను మభ్యపెట్టడం మానుకోవాలని.. గతంలో చేసిన హామీలను అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.