వివిధ టీవీ ఛానళ్లకు నిర్వహించే చర్చ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ నేతలు కొందరు హాజరవుతుంటారు. ఇకపై టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొనే వారిపై రాష్ట్ర నాయకత్వం ఆంక్షలు విధించింది. వివిధ ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా హాజరయ్యే కార్యక్రమాలలో కాంగ్రెస్ భావజాలం, ప్రతిపక్ష పార్టీగా తెరాస వైఫల్యాలను ఎండగట్టేలా కాంగ్రెస్ నాయకులు మాటలు సంధించలేకపోతున్నారని హస్తం వర్గాలు పేర్కొంటున్నాయి. రోజువారీ పార్టీ కార్యకలాపాలు, రాజకీయ పరిణామాలపై కనీస అవగాహన లేకుండా పోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ అంశాలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి మల్లు రవిని ఆదేశించినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి తిరిగి అధికారికంగా ప్రకటన చేసే వరకు ఏ ఒక్కరు టీవీ చర్చలకు హాజరు కావొద్దని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. ఎవరైనా పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే పార్టీపరంగా తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం వెనుక మరోకారణం కూడా ఉందని... టీవీ చర్చల్లో పాల్గొంటున్న కాంగ్రెస్ నాయకులు.. అధిక శాతం పార్టీలోని ఒక వర్గానికే అనుకూలంగా మాట్లాడుతున్నారని భావించి ఆంక్షలు విధించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదీ చూడండి: కాంగ్రెస్‌లో 'హుజూర్నగర్' చిచ్చు.. నేతల మధ్య మాటల యుద్ధం