South Central Railway Canceled 19 Trains : ఒడిశాలో జరిగిన రైల్వే ప్రమాదం దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 19 రైళ్లను రద్దు చేసినట్లు ఎస్‌సీఆర్ చీఫ్ పీఆర్‌వో రాకేశ్ తెలిపారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, సికిందరాబాద్, తిరుపతి మార్గాల్లో దారి మళ్లించిన కొన్ని రైళ్లు ఉన్నాయన్నారు. రద్దు చేసిన రైళ్ల ప్రయాణికుల టికెట్ డబ్బులను తిరిగి ఇస్తామన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ వద్ద టికెట్ చూపించి డబ్బులు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆటోమెటిక్‌గా రిఫండ్ అవుతాయని వివరించారు. రైలు ప్రమాదం జరిగిన ప్రయాణికుల సమాచారం తెలుసుకునేందుకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్‌లలో హెల్ఫ్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
"దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన 19 రైళ్లను రద్దు చేశాము. 29 రైళ్లను దారి మళ్లించారు. మరో రెండు రైళ్ల సమయాన్ని రెండు రోజులకు కుదించారు. కొన్ని రైళ్లలో ప్రయాణికులను ముందు స్టేషన్ వరకు తీసుకొని వెళ్లి.. అక్కడ దించేస్తారు. రద్దు చేసిన రైళ్లకు రిజర్వేషన్ చేసిన ప్రయాణికులకు డబ్బు తిరిగి ఇచ్చేస్తాం. అలాగే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఆటోమెటిక్‌గా డబ్బులు రిఫండ్ అవుతాయి. రైల్వే ప్రమాదానికి సంబంధించిన వివరాల కోసం అన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్‌లలో హెల్ఫ్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటిని వినియోగించుకుంటే తగిన సమాచారం అందిస్తారు." - రాకేశ్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పీఆర్‌వో
ఊహించని ఘోర ప్రమాదం.. బతుకులు ఛిద్రం : ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైల్వే ప్రమాదంలో ఇప్పటి వరకు 270 పైచిలుకు ప్రయాణికులు మృతి చెందారు. మరో 1000 మందికి పైగా ప్రయాణికులు క్షతగాత్రులైయ్యారు. దేశం మొత్తం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. చరిత్రలో ఎప్పుడూ రైల్వేలో ఇంతలా ప్రాణ నష్టం చేకూర్చిన ఘటనలు జరగలేదు. రక్షణ చర్యల్లో భాగంగా.. 200 అంబులెన్స్‌లను, 1200 మంది సిబ్బంది.. భారీ క్రేన్స్‌ను ఉపయోగించి.. శుక్రవారం రాత్రి నుంచి ముమ్మరంగా చర్యలు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 178 మంది ప్రయాణికులు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించినట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. కోరమాండల్ రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థనే కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ కోరమాండల్ రైలు లూప్ లైన్లో వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో.. ఎక్స్‌ప్రెస్‌లోని బోగీలు చెల్లాచెదురైపోయాయి. అటువైపుగా వస్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలు బోగీలు చెల్లాచెదురైపోయాయి.
ఇవీ చదవండి :