పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేసేవారిపై షాడో బృందాల నిఘా ఉంచాలని అధికారులను ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్‌లో ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన ఆయన... ఎన్నికల నిర్వహణ, వ్యాక్సినేషన్‌పై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఏకగ్రీవాలపై వివిధ పార్టీల నేతలు గవర్నర్‌ను కలిశారు. ఏకగ్రీవాల కోసం భారీగా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రకటన ఇచ్చిన అధికారులను వివరణ కోరాం. మాకు తెలియకుండా ఇలాంటి పత్రికా ప్రకటనలు ఎలా ఇస్తారు..?. సామరస్యంగా ఏకగ్రీవాలు చేయడం మంచి పద్ధతి. బలవంతం చేసి, భయపెట్టి ఏకగ్రీవాలు చేయడం గర్హనీయం. భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయ సాధనే ప్రజాస్వామ్యం.
-నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఏపీ ఎస్‌ఈసీ
అనవసర జోక్యం ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని ఎస్‌ఈసీ హితవు పలికారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసేవారిని గృహనిర్బంధం చేస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి: సాంకేతిక పరిజ్ఞానంతో అనేక సవాళ్లకు పరిష్కారం: కేటీఆర్