కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడం, రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేయడంతో నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దాదాపు 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది మార్చి 23న నిలిచిన ఎంఎంటీఎస్ సేవలను ఈ నెల 23 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముందుగా 10 రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని బట్టి క్రమంగా సర్వీసులు పెంచుతామని స్పష్టం చేశారు.
2003 ఆగస్టులో ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లు గతేడాది మార్చి 23 వరకు నిరంతరాయంగా సేవలందించాయి. అలాంటిది కరోనా దెబ్బకు 15నెలలుగా షెడ్డుకే పరిమితంకాగా... కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 23 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లు..
ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 29 కిలోమీటర్ల మేర 2003 నుంచి నిరంతరం సేవలందిస్తున్నాయి. 15 కిలోమీటర్ల సికింద్రాబాద్-ఫలక్నుమా సెక్షన్ ఫిబ్రవరి 2014లో ప్రారంభమైంది. జంట నగరాల్లో మొత్తం 26 స్టేషన్లలో ఎంఎంటీఎస్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ప్రారంభంలో 48 సర్వీసులు, 6 కోచ్‌లు 13వేలమంది ప్రయాణికులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ ప్రస్తుతం 121 సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇదీ చదవండి: CM KCR:వరంగల్ గ్రామీణ, అర్బన్ జిల్లాలకు కొత్త పేర్లు