Organ donation Telangana 2021 : రాష్ట్రంలో జీవన్ దాన్ కార్యక్రమం ఏటికేడు విస్తృతంగా సాగుతోంది. మరణంలోనూ మరికొందరికి జీవం పోసే ఈ మహత్తర కార్యక్రమం పట్ల అవగాహన పెరుగుతోంది. ఈ ఏడాది రోడ్డు ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ ఆంజనేయులు ఎనిమిది మందికి కొత్త జీవితం ప్రసాదించారు. వలిగొండకు చెందిన మహిళ అశ్విని... కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపింది. ఇలా ఒకరిద్దరు కాదు వందల మంది తాము చనిపోతూ... నలుగురిలో జీవిస్తున్నారు.
ఈ ఏడాదిలో అధికం
Jeevandan record 2021: ఈ ఏడాది జీవన్ దాన్లో రికార్డు స్థాయిలో అవయవ దానాలు జరిగాయి. 2013లో రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. అత్యధికంగా 2021లో 158 మంది తాము చనిపోతూ... 608కి అవయవాలు దానం చేశారు. 2018లోనూ 160 మంది అవయవదానాలు చేసినప్పటికీ సేకరించిన అవయవాలు కేవలం 573 మాత్రమే. ఇటీవల అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరగటమే ఇందుకు కారణమని జీవన్ దాన్ ఇంఛార్జి డాక్టర్ స్వర్ణలత తెలిపారు.
ఈ ఏడాది కొవిడ్ కాలంలోనూ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం చురుగ్గా సాగింది. అవయవదానంపై ప్రజల్లో అవగాహన వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు 158 మంది అవయవ దానం చేశారు. లాస్ట్ ఈయర్తో పోల్చితే డబుల్ అయ్యాయి. కానీ అవయవాలు అవసరమైన వాళ్లు లక్షల్లో ఉండగా.. దాతలు వందల్లోనే ఉన్నారు. మరికొంతమంది ఆర్గాన్ డొనేషన్‌కు ముందుకు రావాలి.
-డాక్టర్ స్వర్ణలత, జీవన్ దాన్ ఇంఛార్జి
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ చురుగ్గా..
ఈ ఏడాది అవయవదానాల్లో అత్యధికంగా సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగాయి. ఈ ఏడాదిలో జరిగిన మొత్తం 608 అవయవదానాల్లో 225 కిడ్నీలు, ఆ తర్వాత 137 లివర్, 136 కార్నియాలు దానం చేయగా.. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది ఊపిరితిత్తుల డొనేషన్లు జరిగాయి. 2014 నుంచి ఇప్పటివరకు 125 ఊపిరితిత్తుల దానం చేయగా... అందులో 82 ఊపిరితిత్తులు ఈ ఏడాదే జరగడం విశేషం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు వేగం పుంజుకున్నాయి. నిమ్స్ సహా గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు మొత్తం 3,667 అవయవదానాలు చేయగా... అందులో 387 అవయవాలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించారు. మరీ ముఖ్యంగా నిమ్స్‌లో 312 శస్త్రచికిత్సలు చేయగా... మరో 67 ఉస్మానియాలో, గాంధీలో 8 నిర్వహించారు. నిమ్స్ ఆస్పత్రిలో తొలిసారిగా ఇటీవలే ఓ యువతికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేశారు.
కిడ్నీ మార్పిడి దేశవ్యాప్తంగా లక్ష మందికి అవసరం ఉంది. జీవన్‌దాన్‌లో రెండు వేల మంది నమోదు చేసుకున్నారు. డైలీ అవయవదానాలు జరిగితే ఆ దాతలకు త్వరగా అందుతాయి. చిన్న చిన్న లీగల్ ప్రొసీజర్స్ మనదేశం, తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకివస్తే... అవసరం ఉన్నవారికి సరైన సమయంలో ఆర్గాన్స్ అందుతాయి.
-డాక్టర్ స్వర్ణలత, జీవన్ దాన్ ఇంఛార్జి
మరింత స్పృహ అవసరం
అవయవదానం పట్ల పెరుగుతున్న అవగాహన మెరుగ్గానే ఉన్నా... మరింత స్పృహ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ రాష్ట్రంలో అయవ దానం కోసం 7,485 మంది జీవన్ దాన్లో నమోదు చేసుకున్నారు. వారంతా అవయవదాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్గాన్ పెయిరింగ్, బ్లడ్ గ్రూప్ మ్యాచ్‌కాని వారికి సైతం అవయవాల మార్పిడి చేసే విధానాలను అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా మరింత మందికి వీలైనంత త్వరగా అవయవాలను అందించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Mother, son Suicide: రెండేళ్ల కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య