President cow worship at Tirumala: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి, తిరుమల పర్యటన ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అలిపిరికి చేరుకున్న రాష్ట్రపతి.. అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరాన్ని సందర్శించారు. మందిరానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. గో ప్రదక్షిణ మందిరం వద్ద వేణుగోపాల స్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె గో ప్రదక్షిణ చేశారు.
గోవులకు అరటి పళ్లు, మేతను తినిపించి నూతన వస్త్రాలు సమర్పించి పూజ నిర్వహించారు. గో తులాభారంలో గోవును ఉంచి.. దాని బరువుకు సమానంగా రూ.6 వేల విలువైన 435 కిలోల సమగ్ర దాణాను విరాళంగా అందజేశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు, మహిళాసాధికారత సాధించిన మహిళలతో ఆమె ముచ్చటించారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని విమానాశ్రయానికి చేరుకుని తిరుగు పయనమయ్యారు.
ఇవీ చదవండి: