కొవిడ్ చికిత్స నిమిత్తం 6.41 లక్షల బిల్లు చెల్లించే వరకు మృతదేహం అప్పగించకపోవడంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కాంటినెంటల్ ఆసుపత్రితో పాటు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ ఫిర్యాదు చేసినట్టయితే దానిపై విచారణ జరిపి.. అది నిరూపితమైతే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోను ఆదేశించింది.
కరోనా బారిన పడి హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 22 న ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే తన భర్త మరణించినా... రూ. 6.41 లక్షల బిల్లు చెల్లించకపోవడం వల్ల మృతదేహాన్ని అప్పగించకపోవడాన్ని సవాలు చేస్తూ లావణ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. కొవిడ్ బాధితుడు ఈ నెల 13 న ఆస్పత్రిలో చేరాడని, 22న మృతి చెందాడని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వైరస్ కారణంగా మృతి చెందినట్టయితే జీహెచ్‌ఎంసీ, పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉందన్నారు. చికిత్సకు ఎక్కువ ఫీజు వసూలు చేయకుండా... ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఈ నెల 22న ఉదయం 11.20 గంటలకు చనిపోతే అదే రోజు 1.30 గంటలకు పోలీసులకు సమాచారం అందజేశామని కాంటినెంటల్ ఆస్పత్రి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం జీహెచ్‌ఎంసీ, పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయన్నారు. అయితే మృతదేహాన్ని తమకు అప్పగించాలని బంధువులు పట్టుబట్టారని తెలిపారు.
వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ పిటిషనర్ ఫిర్యాదు చేసినట్టయితే దానిపై విచారణ జరపాలంటూ డీఎంహెచ్‌వోను ఆదేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు