కొవిడ్-19 మహమ్మారి రెండో దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో లాలాగూడ రైల్వే సెంట్రల్ ఆసుపత్రిలో పారామెడికల్ సిబ్బంది కోసం తాత్కాలిక పద్ధతిన ఉద్యోగ నియామకాల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. నర్సింగ్, సూపరింటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్స్, హాస్పిటల్ ఉద్యోగాల కోసం ఈ నియామకాలు చేపట్టనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసిన /మాజీ రైల్వే ఉద్యోగులు, ఇతర సాధారణ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. వారు కొవిడ్-19 రోగులకు ప్రత్యేకించి క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులలో సేవలందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సేవలను 31 మార్చి 2022 వరకు వినియోగించుకోవచ్చన్నారు. పోస్టులు, జీతభత్యాలు, అర్హతలు, వయస్సు, దరఖాస్తు వివరాల కోసం www.scr.indianrailways.gov.in వెబ్ సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 15 2021 లోపు దరఖాస్తు చేసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్