American Consulate Building Inauguration In Hyderabad : భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్ఠం కావాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. హైదరాబాద్ నానక్‌రాంగూడలో ఏర్పాటుచేసిన నూతన అమెరికన్ కాన్సులేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తమిళిసై.. ఇరు దేశాలు శాంతి భద్రతలపై మరింత కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. తెలుగు భాషను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష అని అమెరికన్ రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పడం.. చాలా సంతోషకరమైన విషయమని ఆమె వివరించారు. అమెరికాలో విద్యాభ్యాసం కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరుదేశాల సత్సంబంధాల సమావేశం టీహబ్‌లో జరిగింది.
"అమెరికా 247వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నా శుభాకాంక్షలు. నా దృష్టిలో ఇది కాన్సులేట్ కార్యాలయం కాదు.. సహృదయం నిండిన నిలయం. తెలుగు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషనని రాయబారి చెప్పారు. తెలంగాణకు సోదరిగా నేను సంతోషపడుతున్నా. అమెరికాలో విద్యాభ్యాసం కోసం నమోదు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది చాలా సంతోషకరం. నా జీవితంలో ఈ రోజు చరిత్రాత్మకమైనది. మన ఇరు దేశాల స్నేహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను." - తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
US Consulate In Hyderabad : అలాగే అమెరికన్ రాయబారి మాట్లాడుతూ.. 340 మిలియన్ డాలర్లతో ఏర్పాటుచేసిన నూతన కాన్సులేట్ భవనం భారత్- అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అమెరికాకు ఇండియా అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ అని భారత యూఎస్ అంబాసిడర్ అన్నారు. భారత్ అమెరికా దేశాల మద్య ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలతో ఇప్పటి వరకు 191 బిలియన్ డాలర్స్ ట్రేడ్ అయిందని వివరించారు. ఇది ఇతర దేశాలతో పోల్చితే అత్యధికమన్నారు. స్టార్టప్ ఎకో సిస్టంలో తెలంగాణ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు.
"ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబెటర్ సెంటర్‌గా ఉన్న టీ హబ్ తెలంగాణ ప్రగతికి నిదర్శనంగా ఉంది. కొత్త కలలకు, ఆలోచనలకు వాస్తవ రూపం అందిస్తూ ఉద్యోగ కల్పనకు ఊతమిస్తోంది. అమెరికా 247వ స్వాతంత్ర్య వేడుకల వేళ హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ ప్రారంభించడం ఆనందంగా ఉంది." - ఎరిక్ గార్సెట్టి, భారత్‌లో అమెరికా రాయబారి
దిగ్గజ సంస్థల్లో నియామకాల జోరు.. H1B ఉద్యోగుల కోసం వేట.. వారికే ప్రాధాన్యం!
US Consulate Office In hyderabad : వీసాలపై ఇండియా నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని.. హెచ్1బీ వీసా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు యూఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి తెలిపారు. ఈ సంవత్సరం యూఎస్ వీసా కోసం 1 మిలియన్ అప్లికేషన్స్ వచ్చాయన్నారు. ఇక హైదరాబాద్‌లో హెరిటేజ్ కట్టడాలను పునరుద్ధరించడానికి అమెరికా కాన్సులేట్ 6 హెరిటేజ్ సైట్స్ దాదాపు 2 బిలియన్ల ఫండ్స్ అందించిందని తెలిపారు. ఈ సందర్భంగా మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది.. పదండి ముందుకు పదండి ముందుకు.. తోసుకు పోదాం పైపైకి అని శ్రీశ్రీ అన్న మాటలను తెలుగులో యూఎస్ కాన్సులేట్ అంబాసిడర్ వినిపించారు.
ఇవీ చదవండి :