Telangana New Secretariat Inauguration Date Fixed : తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ రోజున ఉదయం 11.30 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభం కానుంది.
Telangana New Secretariat : కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యంత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఇతర నాయకులను ఆహ్వానించారు. ఈ వేడుకలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Telangana New Secretariat Inauguration : గతంలో ఉన్న సచివాలయ బ్లాక్‌ల స్థానంలో అత్యాధునిక పాలన సౌధాన్ని నిర్మించే పనులు 2020 జనవరి నాలుగో తేదీన పనులు ప్రారంభమయ్యాయి. మొదట 400 కోట్లు, ఆ తర్వాత 617 కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణాన్ని చేపట్టారు. సచివాలయం ప్రాంగణం మొత్తం విస్తీర్ణం 26.98 ఎకరాలు కాగా వాస్తు దోషాలను నివారించి దీర్ఘ చతురస్రాకారంలో 20 ఎకరాల్లో కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు కొట్టి పడేలా దక్కన్, కాకతీయ శైలి ఉండేలా ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్స్ భవన నమూనా సిద్ధం చేశారు.
వనం లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా విశాలమైన కారిడార్లతో నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఆరు అంతస్తుల్లో సచివాలయ ప్రధాన భావనాన్ని నిర్మించారు. దీని విస్తీర్ణం 7.88 లక్షల చదరపు అడుగులు. మధ్యలో భవనం పైన ఐదు అంతస్థుల మేర భారీ గుమ్మటాలతో కూడిన సెంట్రల్ టవర్స్ నిర్మాణం అవుతోంది. అతిథుల కోసం నిర్మిస్తున్న ఈ పోర్టీకో టవర్స్‌ను... ఆర్నమెంటల్ డోమ్స్, కార్వింగ్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
భవనంపై మొత్తం 34 గుమ్మటాలు ఏర్పాటు చేయగా... తూర్పు, పశ్చిమ వైపుల్లో భవనం మధ్యలో రెండు అతిపెద్ద గుమ్మటాలు, వాటిపై జాతీయ చిహ్నాలు ఏర్పాటు చేశారు. కాంస్యంతో 18 అడుగుల ఎత్తు, ఐదు టన్నుల బరువుతో జాతీయ చిహ్నాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండే భవనం మధ్యలో విశాలమైన కోర్ట్ యార్డ్ వచ్చేలా నిర్మాణం చేశారు. మధ్యలో భారీ ఫౌంటేయిన్ రానుంది.
తెలంగాణ సచివాలయం 28 ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా సిద్ధమవుతోంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు కాగా.. 265 అడుగుల ఎత్తున నిర్మించారు.11 అంతస్తుల ఎత్తుతో నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం సిద్ధమవుతోంది.