తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెత్తురు పోటెత్తుతోంది. తెలంగాణలో 15.52 శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 22.88 శాతం మంది అధిక రక్తపోటుతో చికిత్స పొందుతున్నారు. ఏపీలో మధుమేహులు కూడా అధికంగానే నమోదయ్యారు. ఇక్కడ 23.10 శాతం మంది ఆ సమస్యతో బాధపడుతున్నారు. తెలంగాణలో ఈ శాతం 6.69గా ఉంది.
దేశం మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్‌లో సిఫిలిస్ (సుఖవ్యాధి) కేసులు అధికంగా నమోదయ్యాయి. 2019లో ఏపీలో 10,253 మందికి, తెలంగాణలో 4,809 మందికి ఆ వ్యాధి నిర్ధారణయింది. ఈ వ్యాధితో అధిక మరణాలు(35) చండీగఢ్‌లో సంభవించాయి. ఇక్కడ మినహా మరే రాష్ట్రంలోనూ సిఫిలిస్ మరణాలు నమోదు కాలేదు. డెంగీ, టైఫాయిడ్, డయేరియా కేసులు ఏటికేడు పెరుగుతూ మరణాలకు కారణమవుతుండటం దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో చెప్పకనే చెబుతుండగా, మలేరియా కేసులు గణనీయంగా తగ్గడం ఊరటనిస్తోంది.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన ‘జాతీయ ఆరోగ్య ముఖచిత్రం-2020’ నివేదిక తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వ్యాధుల తీవ్రత, వాటి ప్రభావాన్ని వివరించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్‌సీడీ) క్లినిక్‌లలో పరీక్షలు చేయించుకుని, ఆయా వ్యాధులకు చికిత్సలు పొందుతున్నవారి గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఆ ప్రకారం..
అయ్యో పాపం.. మగవారు అర్థంతరంగా రాలిపోతున్నారు
వేర్వేరు కారణాలతో బలవన్మరణాలకు పాల్పడే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఆత్మహత్య ధోరణి ప్రబలంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3,751 మంది మగవారు ఆత్మహత్యలు చేసుకోగా.. వారిలో 30-45 ఏళ్ల మధ్య వయస్కులు 1,377 మంది, 18-30 ఏళ్ల వారు 1,181 మంది ఉండటం ఆందోళన కల్గించే అంశం. 1,566 మంది మహిళలు బలవన్మరణాలకు పాల్పడగా, వీరిలో 18-30 ఏళ్ల వారు 766 మంది ఉండటం గమనార్హం. తెలంగాణలో 5,612 మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిలో 30-45 ఏళ్ల వారు 1,933 మంది, 18-30 ఏళ్ల వారు 1,599 మంది ఉన్నారు. దేశం మొత్తమ్మీద అత్యధిక ఆత్మహత్యలు మహారాష్ట్రలో (13,497) నమోదయ్యాయి. ఇక్కడ మహిళలు 2,233 మంది ఆత్మహత్య చేసుకోగా.. వీరిలో అధికంగా 18-30 ఏళ్ల వారే (753) ఉన్నారు.
ఇదీ చూడండి: Loan: వెయ్యి కోట్ల రూపాయల రుణానికి బాండ్లు జారీ