కరోనాను అడ్డుకునేందుకు జిల్లాల్లో వైద్య అధికారులు సన్నద్ధంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. సచివాలయం నుంచి జిల్లా వైద్య అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విదేశాల నుంచి ఆయా జిల్లాలకు వచ్చిన ప్రతి వ్యక్తి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి ఉంచాలన్నారు. కరీంనగర్ వంటి జిల్లాల్లో గ్రానైట్ వ్యాపారం కోసం చైనా, ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చిన వారిని గుర్తించి వారిని క్వారంటైన్లో ఉంచినట్టు ఆ జిల్లా అధికారి పేర్కొన్నారు.
ప్రజల్లో కరోనా పట్ల ఉన్న ఆందోళనను దూరం చేసేందుకు సెక్రటరీ స్థాయి నుంచి ఆశా వర్కర్ల వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాల్లో వైద్య సిబ్బంది సమయపాలన లేకపోయినా, విధులు సరిగ్గా నిర్వర్తించక పోయినా ఉపేక్షించవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామన్న మంత్రి ఈటల ఈనెల 10న గ్రామాల్లో కొవిడ్ -19పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి : మిర్చి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షం