Malla Reddy Does Not Have a Own Car : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జోరందుకుంది. ఇందులో భాగంగా బుధవారం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో అఫిడవిట్లు సమర్పించారు. బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్ నేతలు తమ ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు.
Minister Malla Reddy Election Affidavit 2023 : మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) తనకు రూ.95 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. కానీ చేతిలో ఒక్క రూపాయి నగదు లేదని, తనకు కారు కూడా లేదని ఆయన అఫిడవిట్లో తెలిపారు. మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ పలు సంస్థల్లో వ్యాపార భాగస్వామ్యం ఉన్నట్లు పొందుపరిచారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. మొత్తం 6 కేసులు, రూ.18.77 కోట్ల ఆస్తులు, రూ.5.99 కోట్ల అప్పులు ఉన్నాయని వివరించారు.
Bhatti Vikramarka Election Affidavit 2023 : మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క (CLP Leader Bhatti Vikramarka) తన అఫిడవిట్‌లో రూ.8.12 కోట్ల ఆస్తులున్నాయని.. అప్పులేవీ లేవని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి రూ.112.23 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. కోరుట్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ధర్మపురి అర్వింద్ తనపై 17 కేసులతో పాటు రూ.107.43 కోట్ల ఆస్తి ఉందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకున్న నామినేషన్ల ప్రక్రియ-ఇవాళ ముఖ్య నాయకుల్లో ఈటల, కోమటిరెడ్డి
బీఆర్ఎస్ : మేడ్చల్ నుంచి పోటీచేస్తున్న మంత్రి మల్లారెడ్డి రూ.95.95 కోట్ల ఆస్తులను ప్రకటించారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, సూరారం, కండ్లకోయ, ధూలపల్లి.. గుండ్ల పోచంపల్లి, గుండ్ల పోచారం గ్రామాల్లో వ్యవసాయ భూములు.. ఫిరోజ్‌గూడ, మైసమ్మగూడ,.. కొంపల్లి, బోయిన్‌పల్లి బోయిన్‌పల్లి, అబిడ్స్‌లో వాణిజ్య భవనాలున్నాయని అఫిడవిట్‌లో పొందుపరిచారు. మల్లారెడ్డి తన పేరుమీద రూ.41,40,10,776, తన భార్య కల్పనకు రూ.38,69,25,565, డిపెండెంట్ పేరుమీద రూ.10,14,72,400 స్థిరాస్తులున్నాయని.. తమ చరాస్తుల విలువ 5,70,64,666గా పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో అప్పులు రూ.7.5 కోట్లు ఉన్నాయని మల్లారెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో జోరుగా నామినేషన్లు, ఇవాళ ముఖ్య నాయకుల్లో రేవంత్, బండి సంజయ్
Gangula Kamalar Election Affidavit 2023 : కరీంనగర్ నుంచి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) రూ.34.08 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. ఇందులో దాదాపు రూ.7 కోట్ల విలువైన బంగారు వజ్రాభవరణాలు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా రూ.11.53 కోట్ల చరాస్తులు గంగుల పేర ఉండగా.. ఆయన సతీమణి పేరిట రూ.7.87 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు. తన పేరు మీద స్థిరాస్తుల విలువ రూ.13.97 కోట్ల వరకు ఉన్నట్లు వివరించారు. భార్య పేరిట గుండ్లపల్లి, స్తంభంపల్లిలో రూ.82.70 లక్షల విలువైన ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. రూ.50.63 లక్షల రుణాలు ఉన్నాయని గంగుల కమలాకర్ ప్రకటించారు.
పాలేరు అభ్యర్థిగా పోటీచేస్తున్న కందాల ఉపేందర్‌రెడ్డి రూ.89.57 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో ఆయన తన భార్య పేరిట 82 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని కందాల తెలిపారు. మహబూబాబాద్ అభ్యర్థి శంకర్‌నాయక్ కుటుంబానికి 52.23 ఎకరాల వ్యవసాయ భూమి, వాణిజ్య భవనాలు ఉన్నాయని వివరించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.21.06 కోట్లని ఆయన చెప్పారు. ఖైరతాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్‌కు వజ్రాల విలువ రూ.6.68 కోట్లుగా వెల్లడించారు. మూడు కిలోల బంగారం, 54.17 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని అన్నారు. అడ్వాన్సులు, అప్పులు కలిపి రూ.49.55 కోట్లు ఉందని దానం నాగేందర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ : సనత్‌నగర్ అభ్యర్థి కోట నీలిమకు 8.01 కిలోల బంగారు ఆభరణాలు, నాణేలు ఉన్నాయని అఫిడవిట్‌లో ప్రకటించారు. రాజస్థాన్‌లో 10.15 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తం ఆస్తుల విలువ రూ.54.75 కోట్లుగా వెల్లడించారు. ఇందులో తనపేరిట స్థిర, చరాస్తులు కలిపి రూ.52 కోట్లకు పైగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. సంగారెడ్డి అభ్యర్థి జగ్గారెడ్డి (MLA Jagga Reddy) (తూర్పు జయప్రకాశ్‌రెడ్డి) పేరిట 20 కేసులు ఉన్నాయి.
Congress MLA Candidates Nominations in Telangana 2023 : వనపర్తి అభ్యర్థిగా పోటీచేస్తున్న తుడి మేఘారెడ్డి కుటుంబానికి దాదాపు 60 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని వివరించారు. ఆయన తన కుటుంబం మొత్తానికి రూ.23.25 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. ములుగు అభ్యర్థి సీతక్క (MLA Seethakka) రూ.82 లక్షల ఆస్తులతో పాటు గృహరుణం రూ.24.74 లక్షలు ఉందని వెల్లడించారు. ఖానాపూర్ అభ్యర్థి వి.బొజ్జుపై 52 కేసులు ఉన్నాయి.
ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఇలా..
క్రమ సంఖ్య | అభ్యర్థి పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | ఆస్తులు |
1 | అరికేపూడి గాంధీ | శేరిలింగంప్లలి | బీఆర్ఎస్ | రూ.85.14 కోట్లు |
2 | కె. మదన్‌మోహన్ రావు | ఎల్లారెడ్డి | కాంగ్రెస్ | రూ.71.94 కోట్లు |
3 | దానం నాగేందర్ | ఖైరతాబాద్ | బీఆర్ఎస్ | రూ.68.78 కోట్లు |
4 | కె. సంజయ్ | కోరుట్ల | బీఆర్ఎస్ | రూ.62.41 కోట్లు |
5 | కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి | మహేశ్వరం | కాంగ్రెస్ | రూ.57.77 కోట్లు |
6 | మర్రి శశిధర్‌రెడ్డి | సనత్‌నగర్ | బీజేపీ | రూ.51.14 కోట్లు |
7 | కంది శ్రీనివాస్‌రెడ్డి | ఆదిలాబాద్ | కాంగ్రెస్ | రూ.50.88 కోట్లు |
8 | కస్తూరి నరేందర్ | రాజేంద్రనగర్ | కాంగ్రెస్ | రూ.44.55 కోట్లు |
9 | ఒడిదెల సతీశ్‌కుమార్ | హుస్నాబాద్ | బీఆర్ఎస్ | రూ.30.09 కోట్లు |
10 | పైడి రాకేశ్‌రెడ్డి | ఆర్మూరు | బీజేపీ | రూ.18.50 కోట్లు |
11 | రెడ్యానాయక్ | డోర్నకల్ | బీఆర్ఎస్ | రూ.17.09 కోట్లు |
12 | ఎం. భూపాల్‌రెడ్డి | నారాయణఖేడ్ | బీఆర్ఎస్ | రూ.14.03 కోట్లు |
13 | కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి | మునుగోడు | బీఆర్ఎస్ | రూ.13.13 కోట్లు |
14 | పొన్నం ప్రభాకర్ | హుస్నాబాద్ | కాంగ్రెస్ | రూ.11.83 కోట్లు |