రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇస్తారన్న చర్చలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. అది కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. ఎవరి మీడియా వారికుందని, తద్వారా ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుంతియా వల్లే కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని...వాళ్లు వెళ్లిపోతే పార్టీ బలపడుతుందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజలు భాజపా వైపు చూస్తున్నారని చెప్పిన రాజగోపాల్ రెడ్డి... తెరాసకు ఎప్పటికైనా ప్రత్యామ్నాయం భాజపాయేనని పునరుద్ఘాటించారు. తనకు పదవి పోతుందనే భయంలేదని... తాను భాజపాలోకి వెళితే ఇప్పుడు వచ్చేదేముందని ప్రశ్నించారు. మోకాళ్ల మీద యాత్ర చేసినా కేసీఆర్ పట్టించుకోడని స్పష్టం చేశారు. తన సోదరుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రైతుల గురించి యాత్ర చేస్తే తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకత్వం కూడా సరిగ్గాలేదని... కిందిస్థాయిలో ఎవరు పీసీసీ అయితే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: 'వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాంద్యం సాకు'