Junior colleges sale: రాష్ట్రంలో చిన్నస్థాయి ప్రైవేటు జూనియర్ కళాశాలల విక్రయం లాభసాటిగా మారడంతో కొందరు దాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి 2,800కి పైగా కళాశాలలు ఉండగా... ఇప్పుడు వాటి సంఖ్య సుమారు 1600 మించడంలేదు. అంటే దాదాపు 1200 కళాశాలలు నడవటం లేదు. మూతపడిన, సరిగా నడవని కళాశాలలను కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. వాటిలో కొందరు రాష్ట్రస్థాయి రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా వాటా కలుస్తుండటం గమనార్హం. ఏటా సుమారు 100 కళాశాలల వరకు ఇలా చేతులు మారుతున్నాయి. ఈ వ్యవహారాల్లో దళారులు, ఇంటర్‌బోర్డులో కొందరు కిందిస్థాయి అధికారులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.
అన్నీ కార్పొరేట్ చేతుల్లోకి..
ఏటా చేతులు మారుతున్న కళాశాలల్లో ఎక్కువగా కార్పొరేట్ పరిధిలోకి చేరుతున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఏటా ప్రవేశాలు పొందే విద్యార్థుల సంఖ్య సుమారు 4.50 లక్షలు. అందులో దాదాపు రెండు లక్షల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, గురుకులాల్లో చేరుతుంటారు. మిగిలిన 2.50 లక్షల మంది ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారు. వారిలో 1.80 లక్షల మంది వరకు నాలుగైదు కార్పొరేట్ గ్రూపు సంస్థల పరిధిలోని 500కి పైగా ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు. మిగిలిన 70 వేల మందిని ఇతర 1000-1100 ప్రైవేటు జూనియర్ కళాశాలలు పంచుకోవాలి. అంటే ఒక్కో కళాశాలకు సగటున సుమారు 70 మంది వస్తారు. ఏటా 200 మంది చేరితేనే కళాశాలలు నడుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా తక్కువ మంది చేరిన కళాశాలలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలో కొత్త కళాశాలల ఏర్పాటుపై నిషేధం ఉంది. అందుకే ఆయా కార్పొరేట్ సంస్థలు మూతపడిన, నడవని వాటిని కొనుగోలు చేసి తమ సంస్థ పేరుతో నడుపుతున్నాయి. కొందరు కొన్న తర్వాత ఆ కళాశాలను రాజకీయ నేతల అండతో తమకు కావాల్సిన ప్రాంతానికి తరలిస్తున్నారు.
క్రయవిక్రయాలతో లాభార్జన
దాదాపు 30 కళాశాలలతో కార్పొరేట్ స్థాయికి ఎదిగిన ఓ గ్రూపును కూడా మరో కార్పొరేట్ సంస్థ కొలుగోలు చేసింది. అందులో రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధికి సగం వాటా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నడవని కళాశాలలను కొందరు కొని పెట్టుకుని.. లాభాలకు అమ్ముకుంటున్నారు. ఓ ప్రముఖ కళాశాల డైరెక్టర్ వద్దే అలాంటివి 130 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కళాశాలల క్రయవిక్రయాలు ఆయనకో వ్యాపారంగా మారాయి. ‘నిరుద్యోగ యువకులు బడ్జెట్ కళాశాలలను నడుపుతున్నారు. బోధన రుసుం, స్కాలర్‌షిప్‌ల రూపంలో వచ్చే మొత్తాన్ని మాత్రమే ఫీజుగా తీసుకున్న కళాశాలలున్నాయి. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని గత ఎనిమిదేళ్లుగా పెంచలేదు. దానివల్ల చివరకు నష్టాలతో మూసివేస్తున్నారు’ అని రాష్ట్ర ప్రైవేటు జూనియర్ కళాశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్ తెలిపారు.