ఆంధ్రప్రదేశ్లో దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజువారీ రాబడి సైతం మెరుగుపడుతోంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని సర్వీసుల సంఖ్యను పెంచారు. మొత్తం 11 వేల సర్వీసులకు గాను ప్రస్తుతం 6వేల సర్వీసులను నిత్యం నడుపుతున్నారు. ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుండటం వల్ల రోజువారీ రాబడి రూ.6 కోట్ల నుంచి రూ.6.5 కోట్ల మధ్య ఉంటోంది. పూర్తి స్థాయిలో బస్సులు నడిచే సమయంలో రోజువారీ రాబడి రూ.13-14 కోట్లు ఉండగా, ఇప్పుడు అందులో సగం వస్తోంది. ఆక్యుపెన్సీ రేట్(ఓఆ) కూడా పెరిగింది. గత నెల దాకా 52-54 శాతం వరకు ఉండగా, ఇప్పుడు 60.5 శాతం ఓఆర్ ఉంటోంది. లాక్‌డౌన్‌కు ముందు ఇది 75 శాతం వరకుండేది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని సర్వీసులు నడిపేలా ఇప్పటికే అధికారులు ఆదేశాలిచ్చారు. ఏయే మార్గాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటారో.. ఆ మార్గాల్లో అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గురువారం నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణకు సర్వీసులను పునరుద్ధరించి ఉంటే రాబడి నిత్యం రూ.2 కోట్లకుపైగా అదనంగా పెరిగే అవకాశం ఉండేదని చెబుతున్నారు.
తెలంగాణకు సర్వీసులపై నేడు స్పష్టత
ఏపీ-తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ గతంలో ఇచ్చిన మార్గాలవారీగా సర్వీసుల ప్రతిపాదనపై ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు మంగళవారం చర్చించారు. దీనిపై టీఎస్ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడి అధికారులు బుధవారం తమ మంత్రితో చర్చించి స్పష్టతనిస్తారని చెబుతున్నారు. ఒకవేళ దసరాలోపు సర్వీసులు మొదలుకాకపోతే ఆ తరువాత హైదరాబాద్‌కు బస్సులు నడపడంపై ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు దృష్టి పెడుతున్నారు.
కొవిడ్ బాధిత ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులివ్వాలి
కొవిడ్ బారినపడిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఆర్టీసీ ఎండీకి విన్నవించామని ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండీని కలిసి పలు సమస్యలపై వినతిని అందజేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగులకు చెందిన చివరి మొత్తాలు, 2019 ఫిబ్రవరి వరకు చనిపోయిన, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆర్టీసీ ఎండీ అంగీకరించారని తెలిపారు.
ఇదీ చదవండి: దసరాకు టీఎస్‌ఆర్టీసీ మూడు వేల ప్రత్యేక సర్వీసులు