రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి తగిన చర్యలు తీసుకుని పరిస్థితులను కట్టడిలోనే ఉంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. వైద్యుల రక్షణకు అవసరమైన పీపీఈ కిట్‌ల నుంచి సామాన్యులకు అవసరమైన నిత్యావసర సరకులు, కూరగాయలు, అన్నార్తులకు, అనాథలకు ఆహారం, వలస కార్మికులకు ఆశ్రయం ఇలా అన్ని చర్యలు చేపడతున్నామని తెలిపింది.
* వైద్యఆరోగ్యశాఖ, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, కార్మిక శాఖ, పురపాలక శాఖలతోపాటు జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికను అందజేసింది. 3.35 లక్షల పీపీఈ కిట్‌లను, 7.72 లక్షల ఎన్-95 మాస్క్‌లు కొనుగోలు చేశామని వివరించింది. 600 వెంటిలేటర్లకు ఆర్డర్ చేశామంది. కరోనా నిపుణుల కమిటీ సిఫారసు మేరకు 53 రకాల మందులను సేకరిస్తున్నట్లు తెలిపింది.
* జాతీయ ఆహార భద్రత పథకం కింద బియ్యం సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కార్డుదారులకు రూ.1314 కోట్లు విడుదల చేసిందని, ఇప్పటికే రూ.1111.08 కోట్లు.. 74.07 లక్షల మంది ఖాతాల్లో జమకాగా, మిగిలినవారి ఖాతాల వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామంది.
* యాచకులు, ఇళ్లులేనివారు, కూలీలు తదితరులకు ఆశ్రయం కల్పిస్తున్నామంది. పట్టణ స్థానిక సంస్థలు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా 2.74 లక్షల మందికి భోజనం పెట్టినట్లు వివరిచింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచితంగా అన్నపూర్ణ భోజనాలను 189 కేంద్రాల్లో మధ్యాహ్నం 12.61 లక్షలు, రాత్రి 94 కేంద్రాల్లో 6.51 లక్షల మందికి భోజనం అందజేసినట్లు పేర్కొంది.
* అన్ని జిల్లాల్లో సర్వే జరిపి వలస కార్మికులను గుర్తించి తగిన ఆశ్రయం, ఆహారం, నీరు, మందులు అందజేయాలని కలెక్టర్లకు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశామంది. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సర్వేలో 3,35,669 మంది వలస కార్మికులున్నారని, వారందరికీ 12 కిలోల బియ్యం, రూ.500 నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల నిమిత్తం నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు ఆర్థిక సాయం అందించేందకు నిర్ణయించినట్లు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.
వలస కూలీల మాటేంటి? : హైకోర్టు
రాష్ట్రంలో 2 లక్షల మందికిపైగా వలస కూలీలను ఆదుకున్నామని ప్రభుత్వం చెబుతోందని.. గణాంకాల ప్రకారం మిగిలిన లక్ష మంది పరిస్థితి ఏమిటని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, సిబ్బంది రక్షణకు చేపడుతున్న చర్యలేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగింది. వైరస్‌కు సంబంధించి ప్రభుత్వ చర్యలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
* కరోనా నేపథ్యంలో వైద్యం చేస్తున్న డాక్టర్లు, సిబ్బందికే కాకుండా మిగిలిన ప్రభుత్వాస్పత్రుల్లో ఎందరు డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు, వ్యక్తిగత రక్షణ కిట్‌ల లభ్యత ఎలా ఉందన్న దానిపై ప్రతి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ మే 6లోగా నివేదిక సమర్పించాలంది. ఏజీ బి.ఎస్.ప్రసాద్ జవాబిస్తూ ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులకు సరిపడా పీపీఈ కిట్‌లు, మాస్క్‌లను అందజేసినట్లు చెప్పారు.
* నిత్యావసరాలు, కూరగాయలు, మాంసం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పగా అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ విభేదిస్తూ సాధారణ రోజుల కంటే 6 శాతం తక్కువ ధరలకు లభిస్తున్నాయని చెప్పారు. రైతు బజార్లు, మాంసం దుకాణాలను అక్కడక్కడా పరిశీలించి ధరలపై ఈనెల 29లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది.
* కామారెడ్డిలో ఇద్దరు వలస కార్మికులు మరణించిన విషయాన్ని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఏజీ సమాధానమిస్తూ రాష్ట్రంలో 3.35 లక్షల మందికి పైగా వలస కార్మికులకు గుర్తించి.. 2 లక్షల మందికి ఆర్థిక సాయం అందజేశామని చెప్పారు. దీనికి మిగిలిన లక్ష మంది పరిస్థితి ఏమిటన్న దానిపై మే 8లోగా నివేదిక సమర్పించాలంది.
* కేరళ, ఏపీల్లోలా ర్యాపిడ్ పరీక్షల కిట్‌లను ఎందుకు వినియోగించలేదన్న ధర్మాసనం ప్రశ్నకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ సమాధానమిస్తూ రాష్ట్రంలో 9 ల్యాబ్‌లున్నాయని, ఒక్కో ల్యాబ్‌లో రోజుకు 4 వేల చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనేపథ్యంలో ర్యాపిడ్ పరీక్ష కిట్‌లు అవసరంలేదన్నారు.
ఇదీ చదవండి: జాతీయ రహదారులపై అభివృద్ధి పనులు ప్రారంభం