సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చెరువు పరిధిలోని ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అమీన్పూర్ చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలంటూ హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ఖండేల్ వాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీవ వైవిధ్య వారసత్వ జలాశయంగా, దేశంలోనే మొదటి అర్బన్ చెరువుగా గుర్తింపు పొందిన అమీన్పూర్ చెరువు కబ్జాకు గురవుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
అమీన్పూర్ చెరువుపై సుమారు 271 రకాల పక్షులు ఆధారపడి ఉన్నాయన్నారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం గతేడాది జులైలో అభ్యంతరాలు స్వీకరించినప్పటికీ.. తర్వాత కదలిక లేదన్నారు. ఎఫ్టీఎల్ నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించినప్పటికీ.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. స్పందించిన ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ.. చెరువు ఆక్రమణలు, ఎఫ్టీఎల్పై స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు