ప్రాణాపాయం నడుమ కొట్టుమిట్టాడుతున్న ఓ మూగ ప్రాణి ప్రాణాలు కాపాడింది అగ్నిమాపక శాఖ సిబ్బంది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద రోడ్డుపై వీధి దీపాల విద్యుత్ స్తంభంపై గాలిపటం మాంజాకు ఓ కపోతం తట్టుకుంది. ఆ మాంజా దారం కాళ్లకు చిక్కుకుపోవడం వల్ల... అది ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. కిందకు వేలాడుతూ ప్రాణాపాయస్థితిలో గిలగిల్లాడిపోయింది. అది చూసిన ఓ స్థానికులిద్దరు కాపాడే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో... విద్యుత్ స్తంభం సగం వరకైనా ఎక్కి లాగుదామంటే నిబంధనలు అడ్డొస్తాయని భయపడ్డారు.
అదే సమయానికి ఆపద్భాందవుల్లా...
అదృష్టం కొద్ది అదే సమయంలో... ఆ రోడ్డుపై విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శకటం రావడం గమనించిన ఆ స్థానికులు ఆపి విషయాన్ని సిబ్బందికి వివరించారు. వెంటనే స్పందించిన సిబ్బంది శకటం ఎక్కి చాకచక్యంగా ఒక పొడవైన వెదురు నిచ్చెనకు చివరలో కాల్చిన సిగరెట్ ఏర్పాటు చేసి.. దాంతో ఆ మాంజా తెంపారు. అంతే... ఆ పావురం క్షేమంగా సిబ్బంది చేతికి వచ్చింది. మెల్లగా కాళ్లకు చిక్కుపడ్డ మాంజా విప్పేసి గాలిలో వదిలేశారు. సంతోషంగా ఆ కపోతం గాలిలో ఎగురుకుంటూ వెళ్లిపోవడంతో... స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
పక్షుల పాలిట శాపం
సంక్రాంతి పండుగ వేళ... జంట నగరాల్లో చైనా మాంజా వినియోగించి గాలిపటాలు ఎగరేయడం వల్ల చాలా చోట్ల అది పక్షుల పాలిట శాపంగా మారిపోయింది. పోలీసు శాఖ, జీహెచ్‌ఎంసీ పదే పదే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ... యువత మాంజా ఉపయోగించడం తీవ్ర ప్రభావం చూపుతుందనడానికి ఇదొక ఉదాహరణ అని స్థానికులు అంటున్నారు.
ఇవీ చూడండి: వందేళ్లుగా ఆ గ్రామ ప్రజలు సంక్రాంతికి దూరం!