KCR Maharashtra visits Today : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి కొల్హాపూర్‌కు బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత ముందుగా అంబబాయి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి సాంగ్లి జిల్లాలోని వాటేగావ్ గ్రామంలో.. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రముఖ సంఘ సంస్కర్త దివంగత అన్నాభావూ సాఠే 103వ జయంతి వేడుకల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఆయన విగ్రహానికి కేసీఆర్ నివాళులర్పిస్తారు. ఒంటిగంటకు అన్నాభావూ కుటుంబ సభ్యులను కలుస్తారు. 1:30 గంటలకు ఇస్లాంపూర్‌లోని రఘునాథ్‌దాదా పాటిల్ ఇంట్లో భోజనం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
ఇటీవలే కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించిన విషయం తెలిసిందే. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ వాహన శ్రేణితో ఆ రాష్ట్రంలో పర్యటించారు. రెండురోజుల పాటు సోలాపూర్, దారాశివ్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనకు రెండు ప్రత్యేక బస్సులతో పాటు 600 వాహనాలతో కూడిన సీఎం కాన్వాయ్ కదిలింది. తొలుత ధారాశివ్కు చేరుకున్న కేసీఆర్‌కు అక్కడి స్థానిక నేతలు, మహిళలు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.
అనంతరం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో మహారాష్ట్రలోని ఉమర్గాలో మధ్యాహ్నం కేసీఆర్ భోజనం చేశారు. ఆ తర్వాత సీఎం అక్కడి నుంచి సోలాపూర్‌కు బయలుదేరారు. సోలాపూర్‌కు చేరుకున్న కేసీఆర్‌కు స్థానిక నేతలు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని భారీ గజమాలతో నేతలు సత్కరించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. సీఎంను చూసేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి కనబరిచారు.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కాసేపు బాలాజీ సరోవర్ హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడి నుంచి కేసీఆర్ బీఆర్‌ఎస్ నాయకుడు ధర్మన్న ముండయ్య సాదుల్ ఆహ్వానం మేరకు.. భావనారుషిపేట్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయనతో సమకాలీన రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ చర్చించారు. కొందరు స్థానిక నేతలు, తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలు ముఖ్యమంత్రి కలిశారు. అనంతరం మరుసటిరోజు ఉదయం పండరీపూర్‌కు వెళ్లారు.
అక్కడ విఠోభా రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలోనే సర్కోలీ గ్రామానికి చేరుకున్న కేసీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో ప్రసగించారు. ఈ సభలోనే ఎన్సీపీకి చెందిన సోలాపుర్ జిల్లా ప్రముఖ నేత భగీరథ్ భాల్కే సహా పలువురు నాయకులు పార్టీలో చేరారు. అక్కడే భోజనాలు ముగించుకొని.. మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే మార్గంమధ్యలో 3.30 గంటలకు దారాశివ్ జిల్లా తుల్జాపుర్‌లోని ప్రముఖ శక్తిపీఠం తుల్జా భవానీ అమ్మవారిని సీఎం కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు.
ఇవీ చదవండి : KCR on Dharani Portal : 'ధరణి ద్వారా యజమానులు మాత్రమే భూమిని ఇతరులకు మార్చగలరు'