Time off day in electricity consumption: మనం రోజూ వాడే కరెంట్ వినియోగంలో ఏదో ఒక సందర్భంలో విద్యుత్ వినియోగ డిమాండ్ అత్యధికంగా ఉంటుంది. ఆ సమయంలో వాడే కరెంట్‌కు 10 నుంచి 20 శాతం కరెంట్ ఛార్జీలు పెంచాలని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ‘టైం ఆఫ్ డే పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అత్యధిక డిమాండ్ ఉన్న సమయం (టీఓడీ)లో కరెంట్ వాడే పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 2024 ఏప్రిల్ 1లోగా 20 శాతం, ఇతర వర్గాల వినియోగదారులకు 2025 ఏప్రిల్ 1లోగా 10 శాతం ఛార్జీలను పెంచి వసూలు చేయాలని చూస్తోంది.
గరిష్ఠ డిమాండ్ ఉన్న సమయాలను వినియోగదారులకు తెలపాలని స్పష్టం చేసింది. అలానే రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ ఎండ కాచే సమయంలో సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో వాడే విద్యుత్‌కు ఛార్జీలను 20 శాతం తగ్గించాలని తెలిపింది. ఈ మేరకు వినియోగదారుల హక్కుల నియమావళికి సవరణలు చేస్తూ ముసాయిదా ప్రతిపాదనలను శనివారం అన్ని రాష్ట్రాలకు పంపింది. దానిపై అభ్యంతరాలుంటే వచ్చే నెల 14వ తేదీలోగా.. ఈ మెయిల్ ద్వారా సందేశాలు పంపాలని పేర్కొంది.
TOD in current consumption: విద్యుత్ వినియోగం రోజులో ఒక్కో సమయంలో ఒక్కో రకంగా ఉంటుంది. మన రాష్ట్రంలో అయితే శనివారం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాలకు అత్యధికంగా 13వేల 970 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. రాత్రి 10 గంటలకు డిమాండ్ 8 వేల మెగావాట్లకు పడిపోయిన రోజులు ఉన్నాయి. సాధారణంగా వ్యవసాయ మోటార్లు, వీధి దీపాలు, పరిశ్రమలు, ఇళ్లలో వినియోగం కారణంగా.. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో రోజూ ఉదయం 6 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకూ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఉంటోంది.
గ్రిడ్ నిర్వహణ: ఈ సమయాల్లో కోతలు లేకుండా సరఫరా చేయడానికి పంపిణీ సంస్థలు ఇంధన ఎక్స్ఛేంజీలో యూనిట్‌కు రూ.12 చెల్లించి కరెంట్ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో వాటిపై రూ.వేల కోట్ల అదనపు భారం పడుతోంది. గరిష్ఠ డిమాండ్ కొంత సమయం మాత్రమే ఉండి.. తర్వాత అందులో సగానికి పడిపోతున్నందున కరెంట్ సరఫరా గ్రిడ్ నిర్వహణ కూడా సమస్యాత్మకంగా మారుతోంది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి టీఓడీ విధానాన్ని తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ముసాయిదాలో పేర్కొన్న ఇతర అంశాలు..:
- అన్ని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి. కరెంట్ రీడింగ్‌ను వినియోగదారులు మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో చూసుకునే అవకాశం కల్పించాలి. ప్రతి నెలా విద్యుత్ బిల్లును ఎస్‌ఎంఎస్, యాప్ ద్వారా వారికి నేరుగా పంపించాలి.
- టీఓడీ కింద అదనపు ఛార్జీలను ఏ సమయంలో ఎంత వసూలు చేయాలనే అంశాన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయిస్తుంది. గరిష్ఠ డిమాండ్ సమయాన్ని నిర్ణయించే క్రమంలో సౌర విద్యుత్తు ఉత్పత్తిని కూడా ఈఆర్‌సీ దృష్టిలో ఉంచుకోవాలి. టీవోడీలో కేటగిరీల వారీగా వసూలు చేసే అదనపు ఛార్జీ వివరాలను డిస్కంలు తమ వెబ్‌సైట్‌లో స్పష్టంగా తెలపాలి.
- కనెక్షన్ ఇచ్చే ముందు ఎంత లోడుతో ఇచ్చేది నిర్ణయిస్తారు. స్మార్ట్‌మీటర్ పెట్టాక.. ఆ లోడుకన్నా ఎక్కువ నమోదైతే మరుసటి నెలలో ‘గరిష్ఠ డిమాండ్ లోడు’ పేరుతో జరిమానా వసూలు చేయకూడదు. ఒక నెలలో అదనపు లోడు నమోదైతే.. అంతకుముందు మూడు నెలల సగటు లోడును లెక్కించాలి. ఈ సగటు కూడా కనెక్షన్ ఇచ్చినప్పుడు మంజూరు చేసినదాని కన్నా ఎక్కువగా ఉంటే మరుసటి క్యాలెండర్ ఏడాదిలో మాత్రమే అదనపు రుసుం వసూలు చేయాలి.
ఇవీ చదవండి:
కరెంట్ షాక్ తగిలి ఏనుగు మృతి.. లైవ్ వీడియో వైరల్!
అప్రకటిత కరెంట్ కోతలు.. ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు
ఇదేందయ్యా ఇదీ.. పంచాయతీ కార్యాలయానికి రూ.11 కోట్ల కరెంట్ బిల్లు