దేశీయ ఆవు జాతులను పరిరక్షించటంతో పాటు, వాటి పాలు, పేడ, మూత్రం తదితరాల ద్వారా అదనపు విలువనిచ్చే ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహమివ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయ ఆవులతో ఆర్గానిక్ డెయిరీ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. ఆదర్శ రైతులు, ఆవుల పెంపకందారులకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై చింతలదీవి (నెల్లూరు జిల్లా)లోని ఎన్‌కేబీసీ, పెరికలపాడు (కృష్ణా జిల్లాల్లో)లోని సురభి గోశాలలో శిక్షణ ఇప్పించటంతో పాటు వీరికి బ్యాంకు రుణం, ఆర్గానిక్ ఉత్పత్తుల ధ్రువీకరణ, బ్రాండింగ్ కూడా కల్పించనుంది.
ఆవులకు వైఎస్సార్ పశు నేస్త పరిహార పథకం కింద బీమా సౌకర్యం కల్పిస్తారు. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
50 ఆవులతో ఏర్పాటు చేసే డెయిరీ ప్రాజెక్టుకు రూ.50 లక్షలు, వ్యవసాయ మౌలిక సౌకర్యాల నిధి, ఆర్‌కేవీవై కింద పది జిల్లాల్లో 25 చొప్పున ఆవులతో ఏర్పాటు చేసే 40 డెయిరీలకు ఒక్కో దానికి రూ. 30 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. వాతావరణ మార్పులపై జాతీయ దత్తత నిధి ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లాలోని ఉత్తర ఆలమూరు, బిడదవోలు, విజయనగరం జిల్లాలోని పెరిపి, వీరసాగరం, అనంతపురం జిల్లా గొట్లూరు, వెంకటరాజుకాలవ గ్రామాలను ఎంపిక చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఏ2 పాలను 'గో పుష్ఠి' పేరుతో మార్కెటింగ్ చేస్తారు.
ఇదీ చదవండి : ఎనిమిది గంటలపాటు విచారణ.. తనకేం సంబంధం లేదన్న అఖిలప్రియ!