రేపటి మహిళలపైన నేటి బాలికల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, మూర్తిమత్వం పెంచేందుకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం కృషి చేస్తోందని అదనపు డీజీ స్వాతిలక్రా తెలిపారు. దీనికోసం ప్రత్యేక బాలిక విభాగాన్ని కూడా ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. కళా రంగాల్లో ప్రవేశం ఉన్న బాలికలకు చట్ట, న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నట్లు స్వాతిలక్రా తెలిపారు. మహిళలపై జరిగే హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా భద్రత, భరోసా, బాధ్యత అనే అంశంపై ఆన్లైన్ సదస్సు నిర్వహించారు.
తెలుగు రచయిత్రిల సంఘం, అక్షరయాన్ల సంయుక్త నిర్వహణలో నిర్వహించిన ఈ సదస్సులో నింగిని గెలిచిన నేల అనే 50 కథల సంపుటిని మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా ఆవిష్కరించారు. అతివ రక్షణ, ఆడ పిల్లల మీద వివక్ష అనే అంశంపై పాటల పోటీలు, కరోనా అంశంగా కవితల పోటీలు నిర్వహించామని, దీనితో పాటు పలువురు రచయిత్రిలు రాసిన 50 కథలతో కూడిన నింగిని గెలిచిన నేల అనే పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరిస్తున్నామని తెలిపారు.