వారి ఎదురు చూపులకు పదకొండేళ్లు..!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన జశ్వంత్‌కుమార్ తన సోదరులతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. ఇతనికి భార్య, రెండేళ్ల వయసున్న కుమార్తె ఉంది. అకస్మాత్తుగా జశ్వంత్ అనారోగ్యం పాలయ్యాడు. మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని జాడ కోసం కుటుంబసభ్యులు ఎంతగానో వెతికారు. పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో.. అతని భార్య కూడా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుమార్తెను మాత్రం జశ్వంత్ కుటుంబసభ్యుల వద్దే పెరిగింది.
వైద్యుల కృషితో...!
గత రెండేళ్ల క్రితం ఖమ్మం రహదారులపై అనాథలుగా తిరుగుతున్న 16 మంది మానసిక వ్యాధిగ్రస్తులను జిల్లా మేజిస్ట్రేట్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి పంపించారు . వాళ్లలో జశ్వంత్ కూడా ఉన్నాడు. వైద్యుల కృషి వలన అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారాడు. తన పేరు, ఊరి పేరు, కుటుంబసభ్యుల పేర్లు, ఇతర వివరాలు వైద్యులకు తెలిపాడు.
ఎలా దొరికాడంటే..?
జశ్వంత్ చెప్పిన గ్రామం పేరును గూగుల్‌లో వెదికారు. చుట్టుపక్కల గ్రామాలు కనిపించినప్పటికీ అతను చెప్పిన గ్రామం మాత్రం కనిపించలేదు. మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్ ఉమాశంకర్, మరికొంత మంది వైద్యులు... లఖ్‌నవూలో జరిగిన ఓ సదస్సుకు హాజరుకావడంతో జశ్వంత్‌కుమార్ కుటుంబసభ్యుల జాడ తెలిసింది.
లక్నో పోలీసుల సహకారంతో...!
తప్పిపోయిన వారిని కుటుంబసభ్యుల చెంతకు చేర్చే లఖ్నవూపోలీసుల ప్రయత్నం... వైద్యులను ఆకర్షించింది. తిరిగి హైదరాబాద్ చేరుకున్న వైద్యులు జశ్వంత్‌కుమార్ వివరాలను ఫోటోను లఖ్‌నవూ పోలీసులకు పంపారు. రెండు రోజుల్లోనే జశ్వంత్‌కుమార్ స్వగ్రామం, అతని కుటుంబసభ్యుల వివరాలను గుర్తించిన పోలీసులు... ఆసుపత్రి వైద్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యులను పిలిపించి వారికి అప్పగించారు.
11 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన జశ్వంత్ వారి కళ్లముందు ఆరోగ్యంగా కన్పించటంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. పరస్పర ఆత్మీయ ఆలింగనాలతో ఉద్వేగానికి లోనయ్యారు.

ఇదీ చదవండీ:కార్డులొచ్చాయి..కానీ ఎలా..?