కుండలు విక్రయించగా వచ్చే ఆదాయమే మాకు ఆధారం. ప్రతి వేసవిలో ఇలా వచ్చిన ఆదాయంతోనే ఏడాది పొడవునా కుటుంబం గట్టెక్కుతుంది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న కూతురుకు ఫీజులు, కుటుంబ ఖర్చులకు ఇదే ఆధారం. ఈ ఏడాది రూ.లక్ష అప్పు చేసి వరంగల్ నుంచి కుండలను కొని తెచ్చాం. ఇప్పుడు కరోనాతో విక్రయాలు లేవు. ఫలితంగా ఇంటిలోనే కుండలను ఏడాది పాటు పదిలపర్చుకోవాల్సి రావడం మరింత కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ నగరంలోని గురుద్వార్ ప్రాంతానికి చెందిన లలిత. చేతివృత్తిదారుల తాజా దుస్థితికి ఇదో దృష్టాంతం.
రాష్ట్రంలో 2 లక్షల కుటుంబాలు కుండల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, నారాయణపేట తదితర జిల్లాల్లో తయారయ్యే రంజన్, జామియా వంటి రకరకాల కుండలు పొరుగు రాష్ట్రాలకు భారీగా ఎగుమతి అవుతుంటాయి. రాష్ట్రంలోనూ వేసవిలోనే లక్షల సంఖ్యలో కుండల విక్రయాలు ఉంటాయి. ఈ ఏడాది గిరాకీకి అనుగుణంగా పెద్ద ఎత్తున మట్టిపాత్రలను సిద్ధం చేసుకోగా.. కరోనా ప్రభావాలతో వారి ఆశలు ఆవిరయ్యాయి. ఎగుమతులు నిలిచి సరకంతా ఇళ్లలోనే ఉండిపోయింది. ఇదే తీరులో చేటలు, బుట్టలు అల్లేవారూ చితికిపోతున్నారు.
హైదరాబాద్ నగరంలో రంగుల బుట్టలకు ఎక్కువ గిరాకీ ఉండగా.. ఈ ఏడాది విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తయారు చేసిన వస్తువులు నిల్వగా ఉంటున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 2 లక్షల కుటుంబాలు పనులు కోల్పోయాయని విశ్వ బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాల్‌కోట వెంకటాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:- వుహాన్లో కరోనాపై చైనా మరో కీలక ప్రకటన