రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. ఇప్పుడా ఈవీఎంలన్ని స్ట్రాంగ్ రూంలకు చేరుకున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపర్చారు. వీటి నిర్వహణలో రాజకీయ పార్టీల వారికి అనుమానాలుంటే రిటర్నింగ్ అధికారి అనుమతితో పరిశీలించుకునే విధంగా సౌలభ్యం కల్పించారు.
మూడంచెల భద్రత
ఈవీఎంల భద్రత కోసం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. మొదటి దశలో స్థానిక పోలీసులు, రెండో దశలో రాష్ట్ర ప్రత్యేక పోలీసులు, మూడో దశలో కేంద్ర బలగాలకు చెందిన పోలీసులను నియమించారు. దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు డిచ్‌పల్లి సీఎంసీ కేంద్రానికి చేరుకున్నాయి. ఈవీఎంలను భద్రపరచిన యంత్రాంగం వాటిని సీల్ చేసింది. మే 23న లెక్కింపు ప్రక్రియ ఉన్నందున స్ట్రాంగ్ రూంల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన
ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఈవీఎంలను భద్రపరిచిన కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ పర్యవేక్షించారు. ఫలితాలకు సమయం ఉన్నందున కంటికి రెప్పలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
మెదక్ పార్లమెంట్ తాలూకు స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి, జిల్లా ఎస్పీ చందన దీప్తి పరిశీలించి సీలు వేశారు. నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో గజ్వేల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఈవీఎంలను ఎస్ఆర్ఆర్ కళాశాలలో మూడంచెల భద్రత మధ్య భద్రపరిచారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఈవీఎంలు భద్రపరిచిన రూములను పరిశీలించారు. పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలను మంథని జేఎన్టీయూలో భద్రపరిచారు.
స్ట్రాంగ్ రూమ్‌కు 100 మీటర్ల చుట్టూ నిషేధం విధించారు. పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా పరిసరాల్లోకి రావొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ పచ్చజెండా