మూణ్నెళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామశివారులోని రహదారిపై గొయ్యి ఏర్పడింది. మరోవైపు పాములేరు వాగుతో భారీ కోతకు గురైంది.
అడుగుకో గుంత.. భారీ గొయ్యితో ప్రమాదకరంగా తయారైన ఈ రహదారిపైనే వాహనదారులు ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంభయంగా వెళ్లాల్సివస్తోందని వాహనదారులు వాపోతున్నారు. వర్షాలు తగ్గి మూణ్నెళ్లైనా.. ఇప్పటి వరకు అధికారులు ఈ రహదారిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
మరోవైపు వర్షాలు వచ్చిన ప్రతిసారి పాములేరు వాగు కట్ట తెగడం వల్ల రహదారి కోతకు గురై చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని తాళ్లపాయి గ్రామస్థులు కోరారు. వర్షాలు పడిన ప్రతిసారి భయం గుప్పిట్లో ప్రయాణాలు చేయాల్సి వస్తోందని వాపోయారు. వానాకాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్తే.. మళ్లీ తిరిగొస్తామోలేదోనన్న భయం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. వచ్చే వానాకాలం నాటికైనా ఈ అవస్థల నుంచి తమను తప్పించాలని వేడుకుంటున్నారు.