భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెరాస నాయకుడు తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు కర్కంపేట తెరాస జడ్పీటీసీ కాంతారావు, వారి అనుచరులు హస్తం గూటికి చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పార్టీ కండువాలు కప్పి వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రుణమాఫీ హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ గాలికొదిలేశారని తాటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డూ ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు నిర్మిస్తే చాలదని.. ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ధరణి వల్ల ప్రతి రైతూ ఇబ్బంది పడుతున్నారన్న ఆయన.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి భద్రాచలం వచ్చి పోడు రైతులకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. నిరుపేదలు, గిరిజనులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
రుణమాఫీ హామీని గాలికొదిలేశారు. ధరణి వల్ల ప్రతి రైతూ ఇబ్బంది పడుతున్నాడు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు నిర్మిస్తే చాలదు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ సమస్యలు తీర్చాలి. దివంగత వైఎస్ఆర్ హయాంలో పోడు రైతులకు పట్టాలిచ్చారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నిరుపేదలు, గిరిజనులకు న్యాయం జరగుతుంది.- తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే
సమస్యలు పరిష్కారం కావడం లేదు..: మరోవైపు తెరాస ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని కర్కంగూడ జడ్పీటీసీ కాంతారావు ఆరోపించారు. పినపాక ఎమ్మెల్యేకు భూ కబ్జాలు, ఇసుక మాఫియాపై ఉన్న ఆసక్తి.. ప్రజా సమస్యలపై లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. రైతు సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.
తెరాస ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం కావట్లేదు. పినపాక ఎమ్మెల్యేకు భూ కబ్జాలు, ఇసుక మాఫియాపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై లేదు. ప్రజల సమస్యలు తీరాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే.- కాంతారావు, కర్కంగూడ జడ్పీటీసీ
కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్‌కుమార్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి..