BADRADRI THALAMBRALU: ఈ నెల 10న శ్రీ రామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలు, ప్రసాదాన్ని ఆలయ ఈవో శివాజీ, అర్చకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ముందుగా మంత్రాలు పఠించి.. ముత్యాల తలంబ్రాలతో సీఎంను ఆశీర్వదించి స్వామివారి ప్రతిమను అందించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్ రెడ్డిలకు ఆశీర్వచనం అందించారు.
ముల్లోకాలు మురిసేలా..
శ్రీరామనవమి రోజున రామనామస్మరణతో భదాద్రి మారుమోగింది. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాద్రిలో జగాలను ఏలిన జగదేకవీరుడు శ్రీరామచంద్రుడికి, జగన్మాత సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కల్యాణ వేడుక.. ఆద్యంతం కనుల పండువగా సాగింది. కొవిడ్ ప్రభావంతో రెండేళ్లు సాదాసీదాగా జరిగిన రాములోరి కల్యాణాన్ని ఈసారి కనులారా వీక్షించి భక్తులు పునీతులయ్యారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఏడాదికి ఒకసారి జరిగే సీతారాముల వారి వార్షిక కల్యాణోత్సవం కమనీయంగా సాగింది.
జగదభిరాముడి కల్యాణ మహోత్సవం కనులారా వీక్షించి తరించేందుకు తరలివచ్చిన భక్త జన జయజయ ధ్వానాల మధ్య రాములోరి కల్యాణం జగత్ కల్యాణానికి అద్దం పట్టింది. వేద మంత్రోచ్ఛారణలు మారుమోగుతండగా.. అభిజిత్ లగ్న ముహూర్తాన జీలకర్ర మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచగా... కల్యాణ ఘట్టం ఆవిష్కృతమైంది. శుభముహూర్తంగా.. జగత్ కల్యాణంగా భావించే శుభసన్నివేశంగా..ముల్లోకాలు మురిసే విధంగా మూడు ముళ్ల బంధానికి నిదర్శనంగా మాంగళ్యధారణ జరిగింది.
ఇవీ చూడండి: