తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలో జలకళ సంతరించుకుంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా... భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. స్వర్ణ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులకు కాగా ప్రస్తుతం 1182 అడుగులకు చేరుకుంది. స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల అధికారులు కోరారు.
ఖమ్మం సమీపంలో మున్నేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత మూడు రోజులుగా ఎగువున వరంగల్, మహబుబాబాద్, గుండాల ఏజెన్సీ ప్రాంతంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో వరద చేరింది. వరంగల్ గ్రామీణ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. చెరువుల్లో భారీగా వరద నీరు చేరడంతో అలుగులు పారుతూ జల కళ సంతరించుకుంటున్నాయి. వర్ధన్నపేట పట్టణం మీదుగా ఉన్న ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి: Rains: ఎడతెరిపిలేని వర్షాలతో రెండ్రోజులుగా ముసురుపట్టిన రాష్ట్రం