కరోనా భయం వెంటాడుతున్న వేళ టోక్యో ఒలింపిక్స్ సరిగ్గా జరుగుతుందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చే విషయం తాజాగా జరిగింది. టోక్యో ఒలిపింక్స్‌ను ఆఖరి నిమిషంలో రద్దు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని స్వయంగా నిర్వాహక కమిటీ అధ్యక్షుడు తోషిరో ముటో వెల్లడించారు. ఈ మెగా ఈవెంట్ శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
కరోనా కలవరం
టోక్యో ఒలింపిక్స్‌కు(Tokyo Olympics) ముందు అథ్లెట్లు కరోనా బారిన పడటం నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. మరో మూడు రోజుల్లో ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్స్ జరగాల్సి ఉండగా.. మంగళవారం మరో 9 మందికి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. దీంట్లో ఓ విదేశీ అథ్లెట్ కూడా ఉన్నాడు. దీంతో ఆటలకు సంబంధమున్న కేసుల సంఖ్య 67కు పెరిగింది. ఇందులో ఓ క్రీడాకారిణి ఒలింపిక్ క్రీడాగ్రామంలో ఉన్నట్లు తెలిసింది.
అంతకుముందు, మెక్సికోకు చెందిన ఇద్దరు బేస్ బాల్ ఆటగాళ్లకు కొవిడ్ సోకినట్లు తేలింది. టోక్యోకు బయలుదేరే ముందు వీరికి కరోనా పరీక్ష చేయగా వైరస్ నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని మెక్సికో బేస్ బాల్ వర్గాలు ధ్రువీకరించాయి.
ఇదీ చూడండి.. 'ఒలింపిక్ ఛాంపియన్'గా నల్లజాతీయుడు.. అదే తొలిసారి!