ఐపీఎల్ అర్ధంతరంగా ఆగిపోవడంతో పది రోజుల పాటు దిల్లీలో ఉండి, ఆ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఇంగ్లాండ్‌కు బయల్దేరాలని అనుకున్న ముగ్గురు న్యూజిలాండ్ ఆటగాళ్లు మనసు మార్చుకున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల మాదిరే మాల్దీవులకు వెళ్లిపోయారు.
కొందరు కివీస్ ఆటగాళ్లు నేరుగా స్వదేశానికి వెళ్లి ఆ తర్వాత ఇంగ్లాండ్‌కు చేరుకునేలా ప్రణాళిక వేసుకోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు బెంగళూరు, చెన్నై ఆటగాళ్లు జేమీసన్, శాంట్నర్.. కివీస్ సహాయ సిబ్బందిలో ఒకరైన సీఎస్‌కే ఫిజియో టామీ సింసెక్ పది రోజులు దిల్లీలో మినీ బయో బబుల్‌లో ఉండి తర్వాత లండన్ బయల్దేరాలనుకున్నారు. కానీ దిల్లీలో రెండు రోజులు గడిపాక కరోనా తీవ్రత దృష్ట్యా ఇక్కడ ఉండటం సురక్షితం కాదని భావించిన ఈ నలుగురూ మాల్దీవుల విమానం ఎక్కేసినట్లు సన్‌రైజర్స్ అధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని రోజులు మాల్దీవుల్లో గడిపాక అక్కడి నుంచి వీరంతా లండన్‌కు చేరుకోనున్నారు.
ఇదీ చదవండి:ప్రపంచకప్‌నకు భారత షూటర్లు