విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం అందుకున్న టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. గురువారం జరగనున్న రెండో టెస్టుకు పుణె ఆతిథ్యమివ్వనుంది. ఇందులో గెలిచి.. మరో టెస్టు మిగిలుండగానే సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది కోహ్లీసేన.
రెండో టెస్టులోనూ జోరు కొనసాగిస్తారా..
టెస్టుల్లో ఓపెనర్ అవతారమెత్తిన రోహిత్.. తొలి మ్యాచ్‌లోనే జట్టు విజయంలో కీలక పాత్ర(రెండు శతకాలు) పోషించాడు. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా విజృంభించాడు హిట్‌మ్యాన్.
తొలి టెస్ట్‌లో రోహిత్‌తోపాటు మయాంక్ అగర్వాల్ కూడా చెలరేగి ఆడాడు. కెరీర్లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. రెండో టెస్టులోనూ ఇదే జోరును కొనసాగించే దిశగా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు మయాంక్.
ఒకవేళ పుణె పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తే మన భారత బ్యాట్స్‌మన్ ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. కోహ్లీ సారథ్యంలో ఇప్పటి వరకు సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ఒక్క పిచ్‌పైనే ఓటమి చవిచూసింది టీమిండియా. 2017లో ఆసీస్‌పై పరాజయం పాలైంది. అయితే కోహ్లీ, పుజారా, అజింక్య రహానే, హనుమ విహారీతో బలమైన బ్యాటింగ్ లైనప్ భారత్ సొంతం.
బౌలింగ్‌లో అశ్విన్, జడేజా తమ స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకుంటున్నారు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమీ 5 వికెట్లతో అలరించాడు. తొలి టెస్టులో పెద్దగా రాణించని ఇషాంత్.. పుణె మ్యాచ్‌లో సత్తాచాటాలని ఆశిస్తున్నారు అభిమానులు
దక్షిణాఫ్రికా పుంజుకునేనా..
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పోటీనిచ్చిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైంది. ఈ సారి ఆ తప్పు పునరావృతం కాకుండా సత్తా చాటాలనుకుంటోంది. రెండో టెస్టులో నెగ్గి సిరీస్ ఆశలు సజీవం చేసుకోవాలనుకుంటోంది సఫారీ జట్టు.
మొదటి టెస్టులో ఎల్గార్, డికాక్ శతకాలతో ఆకట్టుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో డేన్ వీరోచితంగా ఆడి అర్ధశతకం చేశాడు. డుప్లెసిస్ ఫర్వాలేదనిపించినా మిగతా వారు గాడిలో పడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో లుంగీ ఎంగిడి, కగిసో రబాడా, ఫిలాండర్ లాంటి మేటి పేసర్లు ఆ జట్టు సొంతం. అయితే తొలి టెస్టులో వీరు పెద్దగా రాణించలేకపోయారు.
వర్షం ముప్పు..
పుణె వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు వరుణుడు ముప్పు పొంచి ఉంది. బుధవారం మధ్యాహ్నం కూడా వర్షం పడింది.
ఇదీ చదవండి: ప్రియ పునియా విధ్వంసం... టీమిండియా ఘన విజయం